నకిలీ నంబర్ తగిలించి తిరుగుతున్నాడని కారు యజమాని ఫిర్యాదు
నరసరావుపేట రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట హైవేపై ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మరణానికి కారణమైన ఏఎస్సై కుమారుడు, ఇతర నిందితులు వినియోగించిన కారు తనదేనని యజమాని ఇచి్చన ఫిర్యాదుపై నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన పుల్లా శ్రీనివాసరెడ్డి తన ఆరి్థక అవసరాల నిమిత్తం నకరికల్లుకు చెందిన అంజినాయుడు వద్ద ఏపీ40 ఏజెడ్4419 నంబర్ గల స్విఫ్ట్ కారును 2024 ఆగస్టులో రూ.1.50 లక్షలకు తాకట్టు పెట్టాడు.
ఆ కారుకు కిస్తీలు ఓ ఫైనాన్స్ కంపెనీలో బకాయిలు ఉండటంతో తప్పించుకునేందుకు టీఎస్08 హెచ్‌వై 3158 నంబర్‌తో ఆ కారును తిప్పుతున్నారు. ఇదే కారుతో ఈ నెల 4న చిలకలూరిపేట హైవేలో వెళ్తున్న కంటైనర్‌ను వెంబడించి డబ్బుల కోసం ఆపడంతో ప్రమాదం జరగ్గా.. ఐదుగురు మరణించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఏఎస్‌ఐ కుమారుడు వెంకట్‌నాయుడుతోపాటు మరో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నకిలీ నంబర్‌తో కారు నడిపినట్టు గుర్తించారు. దానిపై ఆరా తీయగా అంజి, భాను తనకు కార్లను తెచ్చి విక్రయిస్తుంటారంటూ చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న కారు యజమాని శ్రీనివాసరెడ్డి రెండు రోజుల క్రితం తాను తాకట్టు పెట్టిన కారును కొందరు వ్యక్తులు మారు నంబర్‌తో నడిపి అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు.
కస్టడీకి ఏఎస్‌ఐ కుమారుడి గ్యాంగ్
ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి కేసులో అరెస్టయి నరసరావుపేట సబ్‌జైలులో ఉన్న ఏఎస్‌ఐ కుమారుడు వెంకట్‌నాయుడుతో పాటు మరో నలుగుర్ని పోలీసు కస్టడీకి ఇస్తూ చిలకలూరిపేట న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు నకిలీ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ అవతారమెత్తి నేరాలకు పాల్పడ్డారని.. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు వారిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ నాదెండ్ల పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వారిని పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.


