రంగారెడ్డి జిల్లా: తన కూతురు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి వెళుతుందనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. ఆ కుటుంబం కలలు కళ్ళెదుటనే కరిగి పోయాయి. మృత్యు రూపంలో వచ్చిన ఓ కారు వారి ఆశలను చిదిమి వేసింది. రోడ్డును దాటుతున్న తండ్రీ,కూతురును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కౌడిపల్లికి చెందిన యంసాని పాండు, కళ్యాణిలు హయత్‌నగర్‌లోని వినాయకనగర్ కాలనీలో ఉంటున్నారు. పాండు హయత్‌నగర్‌లో ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు.వారికి కుమారుడు వంశి, కూతురు ఐశ్వర్య(19) ఉన్నారు. కొడుకు కెనడాలో ఉండగా కూతురు మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల హస్టల్‌లో ఉంటున్న ఆమె ప్రతి శనివారం ఇంటికి వచ్చేది.
సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బస్సెక్కించేందుకు తండ్రికూతురును వెంట బెట్టుకుని రాగా హయత్‌నగర్ ఆర్టీసీ కాలనీలో ఇద్దరు జాతీయ రహదారిపై రోడ్డును దాటుతున్నారు. అదే సమయంలో ఎల్‌బినగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన క్రెటా కారు (టీఎస్ 07కెజి 9006) వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. కాలికి తీవ్ర గాయం అయిన తండ్రిని చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరి్పంచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోధు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


