కోనేరుసెంటర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను ప్రియుడితో కలిసి కోడలు హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. అత్త చనిపోయిందని భావించి ప్రియుడితో కలిసి మూడేళ్ల బాలుడితో మహిళ పరారైంది. అయితే కొన ఊపిరితో ప్రాణాలు నిలబెట్టుకున్న వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన నలపాల సురేష్ లిఖిత భార్యాభర్తలు, వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సురేష్ తల్లి పార్వతి కొడుకు వద్దే ఉంటుంది. సురేష్ నగరంలోని ఓ పెట్రోల్‌బంకులో పనిచేస్తుంటాడు. సురేష్ ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు.
మూడేళ్ల బాబుతో పరారీ..
అందరూ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి సురేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న పార్వతిపై దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక పార్వతి బిగ్గరగా కేకలు పెడుతూ ఇంట్లో ఉన్న లిఖితను పిలిచింది. లిఖిత ఎంతకీ బయటకు రాలేదు. ఆమెను చంపేందుకు రకరకాలు ప్రయత్నిస్తుండగా పార్వతి అతని దాడిని ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నట్లు నటించిన లిఖిత కారం తెచ్చి ఆ వ్యక్తి చేతికి ఇవ్వటంతో అత్త కళ్లల్లోకి విసిరాడు. అనంతరం ఇద్దరు ఆమెను అంతమొందించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
చివరికి పార్వతి అపస్మారకస్థితికి చేరుకోగా చనిపోయిందనుకుని భావించిన లిఖిత ఆ వ్యక్తితో కలిసి తన మూడేళ్ల బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. గాయాలపాలైన పార్వతి సమీపంలో బంధువుల ఇంటికి విషయం చెప్పగా వారు సురేష్‌కు జరిగిన విషయం చెప్పారు. దీంతో సోమవారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గుర్తుతెలియని వ్యక్తితో పాటు లిఖిత కోసం గాలిస్తున్నట్లు సీఐ ఎస్‌కే నబీ తెలిపారు.


