ఉత్తరప్రదేశ్‌లో ఒక షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహారన్‌పూర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ బిలాల్ తన ప్రియురాలు ఉమ (30)ను దారుణంగా హత్య చేశాడు. సదరు మహిళ తల నరికి మృతదేహాన్ని హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో పడేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఘటన వివరాలు.. డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం బిలాల్, ఉమను సహారన్‌పూర్ నుండి స్విఫ్ట్ కారులో తీసుకెళ్లి దాదాపు ఆరు గంటల పాటు తిరిగారు. అనంతరం ఆమెను లాల్ ధాంగ్ లోయ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం తల నరికి మృతదేహాన్ని అడవిలో పడేసి అక్కడి నుండి పారిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన బిలాల్ ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తూ మరో మహిళతో తనకు కాబోయే పెళ్లి కోసం షాపింగ్ ప్రారంభించాడు.
పోలీసులు తెలిపిన వివరాలు.. బిలాల్ మరో స్త్రీని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉమను తన జీవితంలో నుండి తొలగించడానికి హత్యను ప్లాన్ చేశాడు. ఉమ గతంలో వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఆమె తన వివాహానికి ఒక రోజు ముందు ఇంటిని విడిచి తన ప్రియుడితో కలిసి వెళ్లి పోయింది. తరువాత వివాహం చేసుకుంది. ఏడాదిన్నర క్రితం భర్తకు విడాకులు ఇచ్చి, తన కుమారుడిని తండ్రి వద్దే ఉంచింది.
కుటుంబం స్పందన.. ఉమ మృతదేహం దొరికిందని సమాచారం అందుకున్న తర్వాతే తన హత్య విషయం తెలిసిందని బంధువులు తెలిపారు. ఉమ సోదరుడు మాట్లాడుతూ.. ఆమె తల నరికివేయబడిందని తెలిసి కుటుంబం తీవ్ర షాక్‌కు గురైందని పేర్కొన్నారు. సంఘటనకు 15 రోజుల ముందు ఉమ తన కుమారుడిని కలుసుకుంది. తనకి కొన్ని బట్టలు ఇచ్చి వెళ్లింది. అతనితో జీవించడం ఇష్టం లేదని ఉమ కుమారుడు పోలీసులకు తెలిపాడు.
బిలాల్‌ను అరెస్టు చేసి, ఫోరెన్సిక్ ఫార్మాలిటీలను పూర్తి చేస్తున్నారు. మిగిలిన ఆధారాలను సేకరించి, కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసు ఉత్తరప్రదేశ్ , హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.


