న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) విజయ్ దివస్ సందర్భంగా భారత సాయుధ దళాల ధైర్యసాహసాలు, త్యాగాలను స్మరించుకున్నారు. ‘మన చరిత్రలో గర్వించదగిన క్షణం’ అని ఈ విజయాన్ని ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత సైనికుల అచంచలమైన సంకల్పం, నిస్వార్థ సేవ దేశాన్ని రక్షించాయని,ఈ విజయం తరతరాలకు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుందని ప్రధాని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
On Vijay Diwas, we remember the brave soldiers whose courage and sacrifice ensured India had a historic victory in 1971. Their steadfast resolve and selfless service protected our nation and etched a moment of pride in our history. This day stands as a salute to their valour and…
— Narendra Modi (@narendramodi) December 16, 2025
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ చారిత్రక దినాన్ని పురస్కరించుకుని సాయుధ దళాలకు నివాళులు అర్పించారు. 1971లో దేశానికి విజయాన్ని అందించిన సైనికులకు దేశమంతా కృతజ్ఞతతో నమస్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ వ్యూహాత్మక సంకల్పాన్ని ప్రతిబింబించిందని, సైన్యం, నావికాదళం, వైమానిక దళం మధ్య సమన్వయాన్ని ప్రతిబింబించిందని అన్నారు. వారి శౌర్యం, క్రమశిక్షణ, పోరాట స్ఫూర్తి మన జాతీయ సంకల్పాన్ని బలోపేతం చేస్తున్నాయని ఆయన ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.
1971, డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 16 వరకు భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఫలితంగా తూర్పు పాకిస్తాన్ నుండి విడివడి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ యుద్ధంలో భారత సాయుధ దళాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇది ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగిపోవడంతో డిసెంబర్ 16ను విజయ్ దివస్‌గా ప్రకటించారు. అదే రోజున 93 వేల మందికి పైగా పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. ఇది ఆధునిక సైనిక చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాట్లలో ఒకటిగా నిలిచింది.
ఇది కూడా చదవండి: హఠాత్తుగా ఆగిన కేబుల్ కార్.. తుళ్లిపడిన ప్రయాణికులు!


