శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియాలోగల శాన్ ఫ్రాన్సిస్కోలో కేబుల్ కార్ ప్రమాదం చోటుచేసుకుంది. నోబ్ హిల్‌లో కాలిఫోర్నియా స్ట్రీట్ కేబుల్ కార్ లైన్‌లో జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లీవెన్‌వర్త్- హైడ్ వీధుల మధ్య 1351 కాలిఫోర్నియా వీధి వద్ద కేబుల్ కారు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో అగ్నిమాపక విభాగం (SFFD) వెంటనే స్పందించి, సంఘటనా స్థలంలో 15 మంది బాధితులను రక్షించింది. వీరిలో 13 మంది గాయపడగా, వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
San Francisco fire department is on the scene at 1351 California St. between Leavenworth and Hyde with 14 patients who have been injured from a cable car that came to an abrupt stop. Avoid the area of California between Hyde and Leavenworth. There will be an ongoing… pic.twitter.com/AXsBxMn5DE
— SAN FRANCISCO FIRE DEPARTMENT MEDIA (@SFFDPIO) December 15, 2025
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఘటనా స్థలంలో కారు విండ్‌షీల్డ్ పగిలి ఉండటాన్ని అధికారులు గమనించారు. అగ్నిమాపక అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం కేబుల్ కారుపై ఎవరో ఏదో బలమైన వస్తువు విసిరేసి ఉండవచ్చని, ఫలితంగా డ్రైవర్ అత్యవసరంగా కారును ఆపివేయవలసి వచ్చివుంటుందన్నారు. దీంతో ప్రయాణికులు ముందుకు కుదుపునకు గురయ్యారన్నారు.
శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు విభాగం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఇందుకోసం హైడ్, లీవెన్‌వర్త్ మధ్య కాలిఫోర్నియా వీధిని మూసివేశారు. కాలిఫోర్నియా స్ట్రీట్ కేబుల్ కార్ లైన్ ప్రమాద ఘటన కారణంగా తాత్కాలికంగా ఈ సేవలకు అంతరాయం కలిగించింది. దర్యాప్తులో యాంత్రిక తనిఖీ, సాక్షుల వాంగ్మూలాలు కీలకం కానున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Mexico: కూలిన ప్రైవేట్ జెట్.. పదిమంది సజీవ దహనం


