ఉత్తరప్రదేశ్ గ్రామీణుల కొత్త ఆలోచన
పిలిభిత్: సంగీతంతో ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారని మనకు తెలుసు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణులు ఏకంగా పులుల్నే భయపెడుతున్నారు. కత్తులు, కర్రలకు బదులుగా సంగీతంతో, అదీ మామూలు సినిమా పాటలతోనే వాటిని అదరగొడుతున్నారు. సంగీత ధ్వనుల ధాటికి పులులు అడవిని దాటి పొలాలు, జనావాసాల వైపు రావడానికి జంకుతున్నాయట. ఇప్పుడిక తాము ఊరు బయటకు, పొలాలు, చెరుకు తోటల్లోకి నిర్భయంగా వెళ్లివస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఇంతకీ వీళ్లు ఎలా పులుల్ని వణికిస్తున్నారంటే.. మాలా అటవీ రేంజ్‌లో పిలిభిత్ టైగర్ రిజర్వు ఉంది. పులుల సంరక్షణ ప్రాంతానికి ఆనుకుని డజను వరకు గ్రామాలున్నాయి. గ్రామాల చుట్టూ పొలాలు, దట్టంగా చెరుకు తోటలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో టైగర్ రిజర్వులోని పులులు పొలాలు, చెరుకుతోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆవాసాల సమీపంలో సంచరిస్తుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు శూన్యం. దీంతో, జమునియా గ్రామానికి చెందిన కృష్ణకుమార్ ఓ ఉపాయం కనిపెట్టారు.
‘పెద్ద శబ్దాలను వింటే, జంతువులు భయపడి దూరంగా వెళ్లిపోతాయని నాకు తెలుసు. ఇదే ఉపాయాన్ని అమల్లో పెట్టా. సౌర శక్తితో పనిచేసే మైక్ సెట్‌ను మా చెరుకు తోట వద్ద ఏర్పాటు చేశాను. మైక్ ద్వారా పెద్ద శబ్దంతో వచ్చే సంగీతం, సినిమా పాటలతో పులి వంటి జంతువులు మా ఛాయలకు కూడా రావడం లేదు. మా పొలాలకు దూరంగా వెళ్లిపోతున్నాయి. నన్ను చూసి, మిగతా రైతులు కూడా ఇదే ఉపాయాన్ని అమలుచేస్తూ సత్ఫలితాలు సాధించారు. మా ఊరే కాదు, అజిత్‌పూర్, రామ్‌నగరియా, మహువా, మలా ఘెరా, రిచ్చోలా, బసంత్‌పూర్‌లాంటి పులుల భయమున్న గ్రామాల రైతులూ ఇదే ఉపాయం అమలు చేస్తున్నారు’అని కుమార్ తెలిపారు.


