నెల రోజుల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
టెస్లాను హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
బీఆర్‌ఎస్ కథ ముగిసిపోయింది
బీజేపీకి రాష్టంలో అనుకూలమైన వాతావరణం ఎప్పుడూ లేదు
ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. శాఖలే మారుస్తారా? లేదంటే.. మంత్రులనే మారుస్తారా? అనే విషయంలో మాత్రం తనకు స్పష్టత లేదన్నారు. అయితే, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,« అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిందనని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు.
మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్, సురేఖను తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని, వాళ్లిద్దరూ కాంగ్రెస్ నేతలే అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో పాల్గొనేందుకు మహేశ్ గౌడ్ వచ్చారు. ఈసందర్భంగా ఆయన తెంగాణభవన్‌లో విలేకరులతో చిట్‌చాట్ చేశారు.
‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే నన్ను మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. స్వయంగా కేసీ వేణుగోపాల్ ప్రతిపాదన పెట్టారు. కానీ, నాకు మంత్రి పదవిపై మక్కువ లేదని చెప్పాను’అని అన్నారు. మహేశ్‌గౌడ్ ఇంకా ఏమన్నారంటే..
వేదికపైకి మంత్రులను పిలిస్తే బాగుండేది..
గ్లోబల్ సమ్మిట్‌లో రాజకీయ ప్రాధాన్యత ఉండొద్దనే ఉద్దేశంతోనే మంత్రులను స్టేజీ మీదకు ఆహ్వానించలేదు. అయితే, మంత్రులను కూడా వేదికపైకి పిలిస్తే బాగుండేది. కొందరు ఐఏఎస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ గ్లోబల్ సమ్మిట్‌కు కూడా వస్తే బాగుండేది.
గ్లోబల్ సమ్మిట్ ప్రతిఏటా పెడితే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నాం. బీసీ ప్రైవేట్ బిల్లు పార్లమెంటులో పెడితే బాగుంటుందని రాహుల్ గాం«దీకి చెప్పాం. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ పదవులనూ తొలివిడతలోనే భర్తీ చేయాలి. కానీ, అక్కడ వచి్చన దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోలలేదు. అందుకే ఆ రెండింటిని పెండింగ్‌లో ఉంచాం.
జనం కవిత మాటలు నమ్ముతున్నారు...
బీఆర్‌ఎస్ కథ ముగిసిపోయింది. పదేళ్ల బీఆర్‌ఎస్ అవినీతిని కవిత దగ్గర నుంచి చూసింది కాబట్టే.. ఆమె మాటలను ప్రజలు అంగీకరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేకుండా మనుగడ సాధించడం అంత సులభం కాదు. కేసీఆర్ ఇమేజ్ కేటీఆర్‌కు రాలేదు. హరీశ్‌రావు దెబ్బకొట్టడం ఖాయం. డబ్బులతో కేటీఆర్ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరుగుతుందో కేసీఆర్ ముందే ఊహించారు.. అందుకే ప్రచారానికి రాలేదు’
బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు
బీజేపీకి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఏమాత్రం లేదు. బీజేపీ అధిష్టానానికీ ఆ విషయం తెలుసు. బీజేపీకి 60–70 స్థానాల్లో కనీసం కేడరే లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తు న్నారు. కానీ మేమే కొన్ని విలువలు పాటిస్తున్నాం. కాబట్టే.. అవకాశం ఇవ్వడం లేదు. మళ్లీ ప్రభుత్వం రావడం అనేది మాకు నల్లేరు మీద నడకే.
ఇన్వెస్లర్ల చూపు హైదరాబాద్ వైపే...
రేవంత్ రెడ్డి విజనరీ ఉన్న లీడర్. ఫోర్త్ సిటీ పూర్తయితే దేశంలోని మరే నగరం హైదరాబాద్‌తో తట్టుకోలేదు. కంపెనీలకు అన్ని రకాలుగా అనుకూలమైన పాలసీలు రూపొందించాం. టెస్లాను హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో సహకరించాలని రాహుల్ గాం«దీని కోరాం. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇన్వెస్టర్లు మాత్రం హైదరాబాద్ వైపే చూస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఏ పెద్ద వెంచర్‌లోకి వెళ్లినా పుణే, చెన్నై, ముంబై, బెంగళూరుకు చెందిన వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువశాతం వెంచర్లలో 25 నుంచి 30 శాతం మహారాష్ట్ర వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ ఇండియాలోనే నంబర్ వన్ నగరంగా మారబోతోంది.


