19న కేసీఆర్ అధ్యక్షతన జరిగే విస్తృతస్థాయి సమావేశంలో కార్యాచరణ
నదీ జలాల పరిరక్షణలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శలు
ఏపీకి కేంద్రం సహకరిస్తోందని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీపై పోరుబాట పట్టాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం, నదీ జలాల కేటాయింపు వంటి అంశాలపైనా ఉద్యమించాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ స్వరూపం ఏ తరహాలో ఉండాలనే అంశంపై చర్చించేందుకు విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది.
బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. బీఆర్‌ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈ సమావేశంలో పాల్గొంటుంది.
నదీ జలాల పరిరక్షణలో విఫలం
కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్ర ప్రదేశ్ కొల్లగొడుతున్నా అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫ లమైందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్‌ఎస్ ప్రభు త్వం 90 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 45 టీఎంసీలు చాలంటూ కేంద్రం ముందు దేబిరిస్తోంది. 45 టీఎంసీలకు అంగీకరిస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రం ముందు మోకరిల్లారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ ఎలా పూర్తవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేలా ఉంది’అని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ‘కృష్ణా, గోదావరి జలాలతోపాటు పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చూపుతోంది.
రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదు. రైతాంగ ప్రయోజనాలకు బీజేపీ గండికొడుతోంది. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయం, కావేరీ అనుసంధానం పేరిట ఆంధ్ర జలదోపిడీకి సహకరిస్తున్న విధానంపై ప్రజా ఉద్యమం తప్పదు’అని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి.
ప్రజా ఉద్యమంపై లోతైన చర్చ
తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై ఈ నెల 19న జరిగే విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.


