ఓట్ల చోరీ ఒక్క కాంగ్రెస్ సమస్యే కాదు.. దేశ సమస్య
తొలుత ఓట్లు తర్వాత ఆధార్, భూమి, ఆస్తులు కూడా..
‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’ సభలో సీఎం రేవంత్
రాహుల్ వల్లే రాజ్యాంగం, రిజర్వేషన్లు ఇంకా ఉన్నాయని వ్యాఖ్య
ఆయనకు అందరూ అండగా నిలవాలంటూ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ (ఓట్ల దొంగతనం) అనే అంశం ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్యే కాదు.. ఇది మొత్తం దేశం సమస్య..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ఓట్ చోరీపై జరుగుతున్న యుద్ధంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీకి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ ఒక సిపాయిలా మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని, తెలంగాణ నుంచి తాము వెన్నంటి ఉంటామని చెప్పారు.
ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’పేరుతో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాందీ, ఎంపీ ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్న సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఆ యుద్ధంలో రాహుల్‌ను గెలిపించాలి
‘దేశ ప్రజల రాజ్యాంగ హక్కు కోసం చేస్తున్న యుద్ధంలో రాహుల్‌ను దేశ ప్రజలు గెలిపించాలి. లేదంటే ఓటు హక్కును లాక్కుంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో ముందుగా ఓటరు లిస్టు నుంచి పేరు తొలగిస్తారు. ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, భూమి, ఆస్తులు కూడా లాక్కుంటారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో చట్ట సభలో విస్తృత్తంగా చర్చ జరిగింది.
దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలని మహాత్మాగాం«దీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోరారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత కర్త ఎం.ఎస్ గోల్‌వాల్కర్ తదితరులు ఈ వర్గాలకు ఓటు హక్కును నిరాకరించారు. కానీ మహాత్మాగాందీ, అంబేడ్కర్ పేదలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో వారికి అవకాశం ఇచ్చారు..’అని సీఎం చెప్పారు.
రాహుల్ ముందే హెచ్చరించారు..
‘ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, ఆలోచనా విధానంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ, అమిత్‌షా గత పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలంటూ ఓటర్లను అడిగారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని రాహుల్‌గాంధీ అప్పుడు చెప్పారు. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 240 సీట్లతోనే సరిపెట్టారు. కాబట్టే రాజ్యాంగం రక్షించబడింది. ఇవాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయంటే వారికి 400 సీట్లు రాలేదు కాబట్టే. వారు ఎస్‌ఐఆర్ పేరిట ఓట్ చోరీ చేస్తున్నారు.
దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదల ఓట్లు తొలగించే పనిలో పడ్డారు. గతంలో దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదలకు జరుగుతున్న అన్యాయానికి వ్య తిరేకంగా మహాత్మాగాందీ, అంబేడ్కర్ నిలబడ్డారు. ఇప్పుడు రాహుల్, ఖర్గే ఈ వర్గాలకు మద్దతుగా, మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా.. ఆర్‌ఎస్‌ఎస్, గోల్వార్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా రామ్‌లీలా మైదానంలో మీ ముందు ఉన్నారు.
ఈ యుద్ధంలో మనమంతా రాహుల్‌గాందీకి మద్దతుగా నిలవాలి..’అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితరులు కూడాధర్నాలో పాల్గొన్నారు.


