చిన్నారిపై హత్యాచారం.. ఎట్టకేలకు నిందితుడి ఆటకట్టు
మహారాష్ట్ర పోలీసుల విజయగాథ
కాలం మారినా.. చట్టం మాత్రం నిద్రపోలేదు. తన వేటను ఆపలేదు. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం.. అంటే 2007లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు సాగించిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసింది.
చిన్నారిపై ‘హత్యాచారం’ తరువాత, నిందితుడు సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. నేపాల్ అడవుల్లోని అజ్ఞాతం.. యూపీలోని ఇటుక బట్టీలో దాక్కున్న రహస్యం.. ఇవేవీ చట్టం కళ్లుగప్పలేకపోయాయి. ఎట్టకేలకు మీరా భయందర్–వసాయ్ విరార్ (ఎంబీవీవీ) పోలీసులకు కీచకుడు పట్టుబడ్డాడు. క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ తెలిపిన వివరాలివి.
అది కాళరాత్రి
మాణిక్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ అమానుష ఘటన. 2007 మార్చి 31 రాత్రి, 22 ఏళ్ల నంద్‌లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మ అనే యువకుడు ఒక చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోబరుచుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామున బాలిక ఉసురు తీశాడు. అత్యాచారం, హింసతో పాటు, చివరకు ఉరితాడు బిగించి ఆమెను హత్య చేశాడు.
నేపాల్‌కు పరారైన హంతకుడు
నేరం చేసిన వెంటనే, నందు విశ్వకర్మ అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయాడు. అతను చాలా ఏళ్లు అక్కడే అజ్ఞాతంలో గడిపాడు. ఆ కేసు ఫైల్ మాణిక్‌పూర్ పోలీసుల దగ్గర దుమ్ము పట్టి ఉన్నా, దర్యాప్తు అధికారులు మాత్రం వదిలేయలేదు.
అతి ముఖ్యమైన క్లూ..
వేట మొదలు అయితే.. ఇటీవల కేసును మళ్లీ తిరగదోడిన క్రైమ్ డిటెక్షన్ సెల్–2, వసాయ్ బృందానికి ఊహించని క్లూ దొరికింది. నిందితుడు పాత జీవితాన్ని వదిలి, యూపీకి తిరిగి వచి్చ, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం ఖర్దౌరీలో ఇటుక బట్టీలో కూలీగా దాక్కుని ఉన్నాడని తెలిసింది. దీంతో ఏసీపీ మదన్ బల్లాల్ నాయకత్వంలో, సీనియర్ ఇన్‌స్పెక్టర్ అవిరాజ్ కుర్హాడే బృందం తక్షణమే కదిలింది.
పట్టుబడిన క్షణం
నిందితుడి ఆచూకీ పక్కాగా ధ్రువీకరించుకున్నాక.. డిసెంబర్ 10న యూపీలోని ఖర్దౌరీకి చేరుకున్న పోలీసు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 18 ఏళ్లుగా స్వేచ్ఛా జీవితం గడిపిన విశ్వకర్మ, తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఊహించలేకపోయాడు. చివరకు నంద్‌లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మను డిసెంబర్ 10న అతని స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఖర్దౌరీలో అరెస్టు చేసి మహారాష్ట్రకు తరలించారు.
నిజం నిప్పులాంటిది
ఎంతకాలం దాచినా, పాపం పండక తప్పదు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు.. కానీ జరిగి తీరుతుంది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని చిదిమేసిన హంతకుడికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత సంకెళ్లు పడటమే దీనికి నిదర్శనం. చట్టంపై విశ్వాసాన్ని నిలబెడుతూ పోలీసులు సాగించిన వేట నేటితో ముగిసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


