అత్యధిక ఒంటికొమ్ము ఖడ్గమృగాలున్న జాతీయ పార్క్
కనువిందు చేసే తేయాకు తోటలు
అక్టోబర్ రెండోవారం నుంచి మే నెలాఖరు వరకే అనుమతి
కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్... పర్యాటకులకిది గమ్యస్థానమే కాదు.. జీవవైవిధ్యానికి అతి పెద్ద ఉదాహరణ. ప్రపంచంలోనే అత్యధిక ఒంటికొమ్ము ఖడ్గమృగాలున్న జాతీయ పార్క్ ఇదే. ఇలా చెప్పుకుంటూ పోతే కాజీరంగాకు ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ పార్క్ అసోంలోని గోలాఘాట్, నాగావ్ జిల్లా పరిధిలో విస్తరించి ఉంది. బ్రహ్మపుత్ర నదీ తీరంలో నీటి గలగలలు వినసొంపుగా ఉంటాయి. కార్బీ ఆంగ్లాంగ్ కొండల మధ్య దృశ్యాలు కనువిందు చేస్తాయి.
కాజీరంగా దాదాపు 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఈ జాతీయ పార్క్‌ను ఎన్‌హెచ్–37 మధ్యగా చీల్చుతుంది. ఈ నేషనల్ పార్క్ చుట్టూ తేయాకు తోటలు పరుచుకుని ఎంతో అహ్లాదకరంగా, ఎటుచూసినా పచ్చని దృశ్యాలే కనిపిస్తుంటాయి. ఈ జాతీయ రహదారిలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు రహదారి పక్కన ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవి దున్నలు, జింకలు తిరుగుతూ కనిపిస్తుంటాయి. – కాజీరంగా నుంచి సాక్షి ప్రతినిధి
కాజీరంగాలో అత్యధిక ప్రాంతం చిత్తడి నేలలతోనే కనిపిస్తుంది. భారీ, ఎత్తైన గడ్డిపొదలతో ఈ అడవి దట్టంగా కనిపిస్తుంది. ఈ వాతావరణ పరిస్థితులే వన్యప్రాణులకు ఎంతో ఇష్టమైన ఆవాసంగా మారింది. ఈ అడవిలో పెద్దసంఖ్యలో అడవి పందులు కూడా ఉన్నాయి. చిత్తడి నేలలు ఒక ఎత్తయితే.. చాలాచోట్ల చెరువులు, కుంటలు వన్యప్రాణులకు జీవం పోస్తున్నాయి. ఏడాదిలో కేవలం వేసవి సీజన్‌లోని కొన్నిరోజులు మినహాయిస్తే... ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది.
ఈ పార్క్‌లోకి సందర్శకులను అక్టోబర్ రెండో వారం నుంచి మే నెలాఖరు వరకు మాత్రమే అనుమతిస్తారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ రెండో వారం వరకు వర్షాల నేపథ్యంలో పర్యాటకులను అనుమతించరు. బ్రహ్మపుత్ర నది పోటెత్తినప్పుడు, భారీ వర్షాలతో ఈ అడవిలోనూ వరదలు సంభవిస్తాయి. ఆయా సమయాల్లో వన్యప్రాణులు మృత్యువాత పడటం, గాయపడటం లాంటివి జరుగుతుంటాయి. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంతో ఈ పార్కు స్వరూపం కూడా మారుతుంటుంది. ఈ పార్కులో మానవప్రమేయం చాలా తక్కువ.

ఖడ్గమృగాలపై గతంలో వేటగాళ్లు విరుచుకుపడ్డ పరిస్థితులను అస్సాం ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు పూర్తిగా నిలువరించారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మారింది. వేట చాలావరకు తగ్గింది. కాజీరంగా జాతీయ ఉద్యానవనం కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాకుండాం ప్రకృతి పరిరక్షణకు నిదర్శనంగా మారింది. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అనే సందేశాన్ని కాజీరంగా గట్టిగా వినిపిస్తోంది.
» 1905లో పార్లమెంటులో నోటిఫికేషన్ ద్వారా కాజీరంగాను రిజర్వ్ ఫారెస్టుగా నిర్ధారించారు. 1908లో తుది నోటిఫికేషన్ వచ్చింది.
» 1916లో కాజీరంగాను అభయారణ్యంగా డిక్లేర్ చేశారు.
» 1937లో పర్యాటకులు/సందర్శకులకు అనుమతిచ్చారు.
» 1950లో వన్యప్రాణుల అభయారణ్యంగా నోటిఫై చేశారు.
» 1974లో జాతీయ పార్కుగా నోటిఫై చేశారు.
» 1985లో అంతర్జాతీయ చారిత్రక సంస్థగా యునెస్కో గుర్తించింది.
» 2007లో దీన్ని టైగర్ రిజర్వ్‌గా నోటిఫై చేశారు.
» 2018లో కాజీరంగాను ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఖరారు చేశారు.
» 2022లో స్మగ్లింగ్/వేట రహితంగా ప్రకటించారు.
» 2024లో జాతీయ పార్కుగా పేరొంది 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
కాజీరంగానేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్‌లోని జంతు సంపద (2022 పశుగణన లెక్కల ప్రకారం)...
2,613 ఒంటికొమ్ము ఖడ్గమృగాలు
104 రాయల్ బెంగాల్ టైగర్
1,129 చిత్తడి జింకలు
553 పక్షి జాతులు
550 వృక్ష జాతులు
1,200+ ఏనుగులు
2,565 అడవి దున్నలు

ప్రత్యేకతలు
ప్రపంచంలోనే అత్యధిక ఒంటి కొమ్ము ఖడ్గమృగాలున్నది ఇక్కడే. 1966లో ఇక్కడ 366 ఒంటికొమ్ము ఖడ్గమృగాలుండగా... ఇప్పుడు వాటి సంఖ్య 2,613కి చేరింది. వచ్చేఏడాది వైల్డ్‌లైఫ్ సెన్సెస్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేషనల్ పార్కులో అత్యధిక రాయల్ బెంగాల్ టైగర్లు ఉన్నాయి. అంతేకాకుండా అడవిదున్నల సంఖ్య కూడా ఇక్కడే అత్యధికంగా ఉంది. ఏనుగుల సంఖ్యతో పాటు చిత్తడి జింకలు సైతం ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. 25 రకాల అంతర్జాతీయ పక్షి జాతులు ఇక్కడికి వలస వస్తుంటాయి.

» జంతువుల దాడిలో పదేళ్లలో 19 మంది మృత్యువాత పడ్డారు. 2014, 2015, 2016లో మరణాలు నమోదు కానప్పటికీ... ఆ తర్వాత ఏటా సగటున 3 చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఈ దాడుల్లో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించింది. గాయపడిన వారికి ఆర్థిక సాయంతో పాటు మెరుగైన చికిత్సకు చర్యలు తీసుకుంది.
» కాజీరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ కేంద్రానికి ఏటా టికెట్ల రూపంలో రూ.3.5 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ పులుల సంరక్షణ ప్రాజెక్టుకు ఏటా సగటున రూ.10 నుంచి రూ.12 కోట్ల మేర నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 90 శాతం కాగా... 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది.
» ఈ అటవీ సంరక్షణలో 367 మంది ఉద్యోగులు విధులు ని ర్వహిస్తున్నారు. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌తో పాటు అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్లు, వెటర్నరీ ఆఫీ సర్లు, ఫారెస్ట్ గార్డ్‌లు తదితర కేటగిరీల్లో ఉద్యోగులున్నారు.
» కాజీరంగా జాతీయ పార్క్‌ను నాలుగేళ్లుగా ఏటా సగటున 3 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఇందులో 5 శాతం విదేశీ సందర్శకులే కావడం గమనార్హం. పదేళ్ల క్రితం ఈ పార్క్ విజిటర్ల సంఖ్య 1.31 లక్షలు కాగా.. ఇందులో విదేశీ పర్యాటకులు 8 వేలు. పదేళ్లలో ఈ పర్యాటకుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది.
» ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఎలి ఫెంట్ సఫారీ చేయొచ్చు. ఉదయం7.30 గంటల నుంచి మ ధ్యాహ్నం 3 గంటల వరకు జీపు సఫారీకి అనుమతిస్తారు.
» పార్కులో ప్రవేశానికి దేశ పౌరులకు రూ.100, విదేశీయులకు రూ.650 చొప్పున రుసుము చెల్లించాలి. ఏనుగుపై సఫారీకి విదేశీయులకు రూ.2 వేలు, దేశ పౌరులు రూ.1,200 చెల్లించాలి.
» జీపు సఫారీకి రూ.2,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కెమెరా షూట్, వీడియో కెమెరా షూట్, డాక్యుమెంటరీలు, ఫీచర్‌ఫిల్మ్ తదితరాలకు వేరువేరు ఫీజులుంటాయి. నిర్దేశించిన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కూడా చేసే అవకాశం ఉంది.
» సందర్శకులు ఇక్కడ ఉండేందుకు ప్రత్యేకంగా గెస్ట్ హౌస్‌లు కూడా ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాలి. ఆన్‌లైన్ విధానంలో కూడా ముందస్తుగా గెస్ట్‌హౌస్‌లు, సందర్శనకు బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.


