కమ్యూనిస్టుల ఖిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడింది. 45 సంవత్సరాలుగా ఎల్‌డీఎప్ పాలిస్తున్న కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజెపీ తొలిసారిగా సంచలన విజయం సాధించింది. కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఈ విజయంపై ప్రధాని మోదీ సైతం సంతోషం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు ధన్యవాదాలని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కేరళ ఈపేరు వింటేనే కమ్యూనిస్టుల కంచుకోటగా చెబుతుంటారు. దేశవ్యాప్తంగా లెప్ట్ పార్టీల ప్రభావం క్షీణిస్తున్నా కేరళలో మాత్రం వారి ఉనికి కాపాడుకుంటూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా తన ప్రభంజనం చూపిస్తూ ప్రతిచోట స్వయంగానో లేదా తన కూటమిద్వారానో అధికారం హస్తగతం చేసుకుంటున్న కాషాయదళం ఇంతకాలం కేరళలో మాత్రం తమ ప్రభావం చూపలేక పోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బోణీకొట్టలేకపోయిన ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక సీటుతో సరిపెట్టుకుంది. దీంతో కేరళలో బీజేపీ పోటీలోనే లేనట్లు భావించారు. అయితే ప్రస్తుతం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయం సాధించింది.
ఎన్‌డీఏ కూటమి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 101 స్థానాలున్న కార్పొరేషన్‌లో బీజేపీ ఒంటరిగా 50 స్థానాల్లో గెలుపొందింది. ఎల్‌డీఎఫ్ కూటమి 29 సీట్లు సాధించగా కాంగ్రెస్‌కు చెందిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 స్థానాల్లో విజయం సాధించింది. 2 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అంతేకాకుండా బీజేపీ ఎర్నాకులం జిల్లాలోనిత్రిపునితురా మున్సిపాలిటితో పాటు పాలక్కడ్‌లోనూ జయకేతనం ఎగురవేసింది.
అయితే ఈ విజయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు ఇది "కేరళలో ఇది అద్భుతమైన రోజు రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. యూడీఎఫ్ కూటమికి హృదయపూర్వక శుభాకాంక్షలు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇది మంచి పరిణామం. కార్యకర్తల కష్టం, అవినీతిపై వ్యతిరేకత వీటన్నిటితో 2020 ఫలితాలతో పోల్చితే మరింత మెరుగయ్యాము. అదే విధంగా తిరువనంతపురంలో సంచలన విజయం సాధించిన బీజేపీకి కృతజ్ఞతలు. ఆ ప్రాంతంలో 45 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా నేను ప్రచారం నిర్వహించాను. కానీ ప్రజలు అక్కడ వేరే పార్టీని ఎన్నుకున్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిందే" అని శశిథరూర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో గత నాలుగు దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కూటమే విజయం సాధిస్తూ వస్తుంది. అటువంటి చోట ప్రస్తుతం కాషాయ జెండా ఎగరడం అక్కడ పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. కాగా ఈ నెల 9,11 తేదీలలో కేరళలో స్థానికసంస్థలకు ఎన్నికలు జరిగాయి.


