బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకత్వంపై ఇంటా బయిట విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నాయకత్వ బాధ్యతలు ప్రియాంకా గాంధీకి ఇవ్వాలని లేఖ రాశారు. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తరచుగా ప్రధాని చేయమని ప్రజలను అడుగుతారని, ఆ పదవి కోరుకునే ముందు తానేంటో నిరూపించుకోవాలన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా బాగాలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన ఆ పార్టీ చేసింది. సొంతంగా 99 ఎంపీ సీట్లు సాధించి లోక్ సభ ప్రతిపక్షనేత హోదా దక్కించుకుంది. అయితే ఆ తరువాత జరిగిన హర్యాణా, బిహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆ పార్టీ నాయకత్వంపై ప్రస్తుతం విమర్శలస్తున్నాయి. నాయకత్వాన్ని మార్చకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని క్షేత్రస్థాయిలో క్యాడర్ సూచిస్తున్నారు. ఇటీవల పార్టీ నాయకత్వ బాధ్యతలు ఎంపీ ప్రియాంక గాంధీకి ఇవ్వాలని ఓ కార్యకర్త సోనియాగాంధీకి లేఖ రాయడం పొలిటికల్ హీట్ పెంచింది. కాగా తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాహుల్‌గాంధీని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూలను ఉద్దేశించి భగవంత్ మాన్ వ్యాఖ్యలు చేశారు. భగవంత్ మాన్ మాట్లాడుతూ "రాహుల్ గాంధీ తరచుగా తనని ప్రధాని చేయండి అప్పుడు నేనేమైనా చేస్తాను అంటారు. అయితే అంతకంటే ముందు ప్రజలకు తానేంటో నిరూపించాలి. తరువాత తనని ప్రధాని చేసే విషయం ప్రజలు ఆలోచిస్తారు. ఇదే తరహాలో పంజాబ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్దూ వ్యవహరిస్తారు. తనని పంజాబ్ సీఎం చేయమని అడుగుతారు. ప్రజలు తనకి ఇది వరకే చెప్పారు. మెుదటగా ఏదైనా పనిచేయండి దాని తర్వాత సీఎం చేయాలో లేదో తేలుస్తామన్నారు". అని భగవంత్ మాన్ తెలిపారు.
నాయకత్వం అనేది క్రమశిక్షణగా పనిచేయడం ప్రజల నమ్మకం ద్వారా వస్తుందే తప్ప విద్వేశ ప్రసంగాల ద్వారా రాదని భగవంత్ మాన్ దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని కష్టపడి సంపాదించాలి అని తెలిపారు. భగవంత్ మాన్ తొలుత కామెడీయన్‌గా నటించారు. 2014లో ఆప్ నుంచి తొలిసారిగా ఎంపీ అయ్యారు. 2022 పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో ఈ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇది వరకూ ఆప్ ఇండియా కూటమిలో భాగంగా ఉండేది. 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆ కూటమి నుంచి విడిపోయి స్వతంత్ర్యంగా పోటీచేస్తుంది.


