ఇంట్లో పెంపుడు జంతువులుంటే ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతుందని నమ్ముతారు. అందుకే చాలామంది ఏదో ఒక పెట్‌ను పెంచుకుంటూ ఉంటారు. అల్లారుముద్దుగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ ఒకోసారి పెంపుడు జంతువులే ప్రాణానికి చేటు తెస్తూ ఉంటాయి. బెంగళూరులో జరిగిన ఒక విషాదం గురించి తెలిస్తే హృదయం ద్రవించకమానదు.
బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అరుణ్ కుమార్ ఎంతోఖరీదైన చిలుకను పెంచు కుంటున్నాడు. మకావ్ రకానికి చెందిన దీని విలువ 2.5 లక్షలరూపాయలు. అది ఉన్నట్టుండి ఇంట్లోంచి ఎగిరిపోయి, సమీపంలోని విద్యుత్ స్తంభంపై వాలింది. దాన్ని పట్టుకుందామని ప్రహరీ గోడపైకి ఎక్కాడు. అలా దాన్ని రక్షించబోయే ప్రయత్నంలో అరుణ్ ప్రమాదవశాత్తు హై-వోల్టేజ్ విద్యుత్ తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను కుమార్ గోడపై నుండి కిందపడి గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతణ్ణి అసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. బెంగళూరులోని గిరినగర్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. అరుణ్ కుమార్‌కి వాహనాల నంబర్ ప్లేట్ల తయారీ వ్యాపారం ఉంది.


