చండీగఢ్: హర్యానా సర్కారు కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అత్యంత ప్రతిష్టాత్మక పర్యావరణ కార్యక్రమం ‘హర్యానా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్’ను ప్రపంచ బ్యాంక్ సహకారంతో ప్రారంభించింది. మొత్తం రూ. 3,600 కోట్ల కార్పస్‌తో రూపొందించిన ఈ ఐదేళ్ల ప్రాజెక్ట్.. రాష్ట్రంలో వాయు నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో పారిశ్రామిక నవీకరణలు, ఈ-బస్సుల ఏర్పాటు, మెరుగైన పర్యవేక్షణ మౌలిక సదుపాయాలు మొదలైనవి కీలకంగా ఉన్నాయి. ఈ భారీ కార్యక్రమం ద్వారా హర్యానా సర్కారు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రమాదకరమైన వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
ఈ ప్రాజెక్ట్‌లో కాలుష్య రహిత పరిశ్రమల ప్రోత్సాహానికి చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 1,000 పరిశ్రమలకు వాయు ఇంధనాలపై నడిచే కొత్త బాయిలర్‌లను కొనుగోలు చేయనున్నారు. అదే విధంగా 1,000 డీజీ సెట్‌లను హైబ్రిడ్/డ్యూయల్ ఫ్యూయల్ మోడ్‌పై నడిచేలా చేస్తారు. రవాణా రంగంలో మార్పులు తీసుకురావడానికి 500 ఈ-బస్సులను ఏర్పాటు చేయనున్నారు. డీజిల్ ఆటోలను దశలవారీగా తొలగించడం, 50,000 ఈ-ఆటోలను ప్రోత్సహించడం వంటి చర్యలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. సాధారణ బాయిలర్లు, ఇటుక బట్టీల ఉద్గారాలను తగ్గించడానికి పైలట్ ప్రాతిపదికన రెండు టన్నెల్ బట్టీలు ఏర్పాటు చేయనున్నారు.
మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థ కోసం రాష్ట్రంలో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, పర్యవేక్షణ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. 500 కి.మీల మేర దుమ్ము రహిత రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రియల్ టైమ్ సోర్స్ అపార్ట్‌మెంట్ సామర్థ్యంతో కూడిన 10 నిరంతర పరిసర వాయు నాణ్యత పర్యవేక్షణ (సీఏఏక్యూఎం) స్టేషన్లు, ఒక సీఏఏక్యూఎం మొబైల్ వ్యాన్‌ను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. తద్వారా కాలుష్య స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రణాళికలను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్య నియంత్రణపై జరిగిన సమీక్షా సమావేశంలో హర్యానా ప్రభుత్వం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: తల్లీకుమారుల ఆత్మహత్య.. లేఖలో గుండె పగిలే నిజాలు!


