న్యూఢిల్లీ: గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఢిల్లీకి చెందిన భావనా జోషి అయినవారిని కోల్పోయి, తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్నారు. గత శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె తన భర్త వినోద్ కుమార్ (43)తో పాటు తన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. కమలా జోషి (42), అనితా జోషి (41), సరోజ్ జోషి (39)లను కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 25 మంది మృతిచెందగా, భావన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్లబ్‌లోని అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చూస్తున్నంతలోనే ఎగసిపడి, కొందరి జీవితాలను బుగ్గిపాలు చేశాయి. క్లబ్‌లో నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, పైరోగన్‌ల వాడకం, గడ్డితో కూడిన పైకప్పు, పలు భద్రతా లోపాల కారణంగా మంటలు నిముషాల వ్యవధిలోనే అంతటా చుట్టుముట్టాయి.
నృత్య కార్యక్రమం సందర్భంగా వెలిగించిన విద్యుత్ పైరోగన్‌లే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ క్లబ్‌లో తగినన్ని నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, మండే పదార్థాల వాడకం, మద్యం సీసాల నిల్వలు మొదలైనవి మంటల తీవ్రతను పెంచి, ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం అందజేస్తామని గోవా కలెక్టర్ కార్యాలయం నుండి తనకు కాల్స్ వస్తున్నాయని భావనా జోషి తెలిపారు. అయితే తమకు ఎలాంటి పరిహారం అవసరం లేదని, న్యాయం కావాలని అని ఆమె కోరారు. వారు ఇచ్చే రెండు లక్షలు నా కుటుంబాన్ని తిరిగి తీసుకువస్తాయా? అని ఆమె ప్రశ్నించారు. పరిహారం కంటే న్యాయమే తనకు ముఖ్యమని ఆమె రోదిస్తూ తెలిపారు.
మృత సోదరీమణుల తల్లి మీనా మీడియాతో మాట్లాడుతూ ‘నేను నా పిల్లలను కోల్పోయాను. అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయాను. నేరస్థులు బెయిల్‌పై లేదా జరిమానాతో తప్పించుకోకుండా కఠిన శిక్షలు ఎదుర్కొనేలా చూడాలని’ ఆమె డిమాండ్ చేశారు. కమల భర్త నవీన్ కూడా అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు చేస్తూ.. పలు రెస్టారెంట్లు, క్లబ్‌లలో నిబంధనలు పాటించడం లేదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలావుండగా నైట్‌క్లబ్ సహ యజమానులు, ఢిల్లీకి చెందిన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులు అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ నుండి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయారు. వారిని భారతదేశానికి తీసుకురావడానికి దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
నిందితులు గోవాలో ఈ క్లబ్ నిర్వహణకు భూ ఒప్పందపు నకిలీ కాపీని ఉపయోగించారని పోలీసు దర్యాప్తులో తేలింది. కాగా నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఢిల్లీ కోర్టు దానిని తిరస్కరించింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ నిందితులను త్వరలోనే సంయుక్త దర్యాప్తు బృందం భారతదేశానికి తిరిగి తీసుకువస్తుందన్నారు. ఈ విచారణను కేవలం క్లబ్ యజమానులే కాకుండా, కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతులు మంజూరు చేసిన అధికారులు కూడా ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: ‘అయితే భద్రత గాలికే?’.. రైల్వే యూనియన్ల మండిపాటు


