న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ ఈ–సిగరెట్ తాగుతూ దొరికిపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సౌగతా రాయ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా సదరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సౌగతా రాయ్ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నిషేధిత ఈ–సిగరెట్ తాగుతూ కనిపించారు.
అనురాగ్ ఠాకూర్ ఈ అంశాన్ని ఆదేరోజు లోక్‌సభలో ప్రస్తావించారు. పవిత్రమైన పార్లమెంట్‌లో సిగరెట్ తాగడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సౌగతా రాయ్‌పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. దాంతో అనురాగ్ ఠాకూర్ శుక్రవారం లిఖిపూర్వక ఫిర్యాదు అందించారు. నిషేధిత సిగరెట్ తాగడం చట్టప్రకారం తీవ్రమైన నేరమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పార్లమెంట్ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీపై మండిపడ్డారు. యువతకు ప్రమాదకరమైన సందేశం ఇచ్చారని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నిందితుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఈ–సిగరెట్లను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే నిషేధించింది.
ఇదిలా ఉండగా, ఈ–సిగరెట్ తాగడం చిన్న విషయమని, దీనిపై రాద్ధాంతం అవసరం లేదని సౌగతా రాయ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. మరోవైపు అనురాగ్ ఠాకూర్ తీరును తృణమూల్ కాంగ్రెస్ మరో ఎంపీ కీర్తి ఆజాద్ తప్పుపట్టారు. లిఖితపూర్వక ఫిర్యాదులో సౌగతా రాయ్ పేరు ఎందుకు ప్రస్తావించలేదని కీర్తి ఆజాద్ ప్రశ్నించారు.


