న్యూఢిల్లీ: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికార, విపక్షాలు కలిసికట్టుగా కృషి చేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విన్నవించారు. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం పక్కనపెట్టి.. వాయు కాలుష్యంపై అధికార, విపక్ష సభ్యులు కలిసి సభలో సమగ్ర చర్చ జరపాలని కోరారు. ప్రజల ఇక్కట్లు తీర్చడానికి ఇరుపక్షాలు కలిసి పని చేస్తాయన్న సందేశాన్ని ఇద్దామన్నారు. దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న కాలుష్యంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాన నగరాల్లో ప్రజలు విష వాయువు దుప్పటి కింద నివసిస్తున్నారని చెప్పారు.
లక్షలాది మంది చిన్నారులు ఉపిరితిత్తుల జబ్బుల బారిన పడుతున్నారని, వారి భవిష్యత్తు దెబ్బతింటోందని అన్నారు. ప్రజలు క్యాన్సర్ పీడితులుగా మారుతున్నారని, వృద్ధులు శ్వాస సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలుష్య సమస్యపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని కోరారు. శుక్రవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన కాలుష్యం రాజకీయ సిద్ధాంతపరమైన అంశం కాదని అన్నారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కార మార్గం కనిపెట్టాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు.
చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు
రాహుల్ విజ్ఞప్తిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సానుకూలంగా స్పందించారు. కాలుష్యంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. దీనిపై లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమయం కేటాయిస్తుందన్నారు.


