కొచ్చి: కేరళలో 2017లో సంచలనం సృష్టించిన బహుభాషా నటిపై గ్యాంగ్ రేప్ ఘటనలో కోర్టు ఆరుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో మరో నిందితుడ, మలయాళ నటుడు దిలీప్‌కు కోర్టు ఇటీవలే బయటపడటం తెల్సిందే. ఎర్నాకులం జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి హనీ ఎం వర్గీస్ శుక్రవారం సునీల్ ఎన్‌ఎస్ అలియాస్ పల్సర్ సునీ, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజేష్, సలీం, ప్రదీప్ అనే వారికి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన నేరానికి గాను 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
వీరికి వివిధ నేరాలకు పాల్పడినందుకు గాను అదనంగా జైలు శిక్షలు, వేర్వేరు జరిమానాలు సైతం విధించారు. అశ్లీల వీడియోను ఇతరులకు షేర్ చేసిన నేరానికి గాను సునీకి అదనంగా మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా, సాక్ష్యాన్ని నాశనం చేసిన నేరానికి మార్టిన్‌కు మూడేళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధించారు. ఈ శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని, బెయిల్‌కు ముందు రిమాండ్‌లో కలిపిన కాలాన్ని కూడా శిక్షలో భాగంగానే పరిగణించాలని స్పష్టం చేశారు.
బాధితురాలికి రూ.5 లక్షల పరిహారమివ్వాలని, లైంగికదాడి దృశ్యాలున్న పెన్‌డ్రైవ్‌ను విచారణాధికారి కస్టడీలో ఉంచాలని జడ్జి తెలిపారు. నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తెలిపిన అంశాలనే ఈ కేసుకు కూడా వర్తింప జేసినట్లు చెప్పారు. ఈ తీర్పు తమకు నిరుత్సాహం కలిగించిందని, దోషులందరికీ కోర్టు యావజ్జీవ కారాగారం విధిస్తుందని భావించామని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజా కుమార్ చెప్పారు. దీనిపై త్వరలో కేరళ హైకోర్టుకు వెళతామన్నారు. ఈ నెల 8వ తేదీన ఇదే కేసులో నటుడు దిలీప్ సహా నలుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.


