కొన్ని నెలల తరువాత భర్త చెంతకు భార్య లీల
త్వరలో మళ్లీ పెళ్లి వేడుక
కర్ణాటక: ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా తదితర యాప్‌లతో పరిచయాలు పెరగడం, జీవిత భాగస్వాములు వదిలేసి వెళ్లడం మామూలు విషయమైంది. దీనివల్ల గొడవలు జరిగి కుటుంబాలు రోడ్ల పాలవుతుంటే అభం శుభం తెలియని పిల్లల జీవితం ఛిద్రమవుతోంది. బెంగళూరు బన్నేరుఘట్ట పరిధిలో ఇదే మాదిరిగా భర్తను వదిలేసి ప్రియునితో వెళ్లిపోయిన మహిళ.. కొన్ని నెలల తరువాత మళ్లీ భర్త వద్దకు వచ్చేసింది. దీంతో కథ సుఖాంతమైందని స్థానికులు నిట్టూర్చారు.
ఏం జరిగింది..
సెప్టెంబరు ఆఖర్లో లీల అనే మహిళ భర్త, క్యాబ్‌డ్రైవర్ మంజునాథ్, ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడు సంతుతో వెళ్లిపోయింది. మంజు కన్నీరు కారుస్తూ తన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తిరిగి రావాలని విలపిస్తూ చేసిన వీడియో ప్రచారమైంది. తాను మాత్రం సంతుతోనే ఉంటానని లీల చెప్పింది. సంతు, లీల సరదా ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ బాగోతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
లీలాలో పరివర్తన..
నెలన్నర కిందట మంజు కోపం పట్టలేక సంతును వెతికిపట్టుకుని చితకబాదాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ కేసులో మంజును అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే విడుదలై కొత్త ఆటోను కొనుక్కుని పిల్లలను పోషిస్తున్నాడు. ఇంతలో లీల మనసులో ఏం పరివర్తన వచ్చిందో గానీ ప్రియున్ని వదిలేసి భర్త చెంతకు చేరింది. మంజు ఆమెను ఆత్మీయంగా స్వాగతించాడు. బన్నేరుఘట్టలోని అద్దె ఇంట్లో కులాసాగా కాపురం ప్రారంభించారు. త్వరలో ధర్మస్థలలో మళ్లీ పెళ్లి చేసుకుంటామని, అన్నీ మరచిపోయి సంతోషంగా జీవిస్తామని ఈ జంట చెబుతోంది. ఇది చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు అని కొందరు నెటిజన్లు వాపోతే, మరికొందరు దీవించారు.


