ఆ మధ్య మలయాళంలో సూక్షదర్శిని అనే సినిమా వచ్చింది. అందులో అమాయకంగా కనిపించే తల్లీకొడుకులు.. తమ ఇంటి బిడ్డనే దారుణంగా హతమార్చి.. యాసిడ్‌లో పోసేసి కరిగించేస్తారు. ఆపై ఏం ఎరగనట్లు నాటకాలాడతారు. పరువు హత్య(ఓ సున్నితమైన అంశం) నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ హిట్ అయ్యి.. ఇక్కడ తెలుగు డబ్‌తో ఓటీటీలోనూ అలరించింది. అయితే దాదాపు ఇలాంటి తరహా ఘటనే ఒకటి తెరపైకి వచ్చింది.
వింటేనే వెన్నులో వణుకుపుట్టే ఘటన ఇది. తన భార్యను.. ఇద్దరు పిల్లల తల్లిని.. క్షణికావేశంలోనో లేదంటో ఉద్దేశపూర్వకంగానో హత్య చేశాడో భర్త. ఆపై నేరం నుంచి తప్పించుకునేందుకు అతను చేసిన ప్రయత్నమే కిరాతకంగా ఉంది. ఆమెను ముక్కలుగా.. చెక్కలుగా చేసి.. ముద్దగా మార్చేసి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆ ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి దోషిగా తేలాడు.
స్విట్జర్లాండ్‌లో హైప్రొఫెషనల్ కేసుగా ఉన్న క్రిస్టియానా జోక్సిమోవిక్(38) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడని స్థానిక అధికారులు బుధవారం నిర్ధారించారు. క్రిస్టియానా జోక్సిమోవిక్ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ కావడమే ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది.
2024 ఫిబ్రవరిలో బిన్నింగెన్‌లోని తన నివాసంలో క్రిస్టియానా జోక్సిమోవిక్ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వేళ్లన్నీ భర్త థామస్ వైపే చూపించాయి. అయితే తన భార్య తనపై దాడికి ప్రయత్నించిందని.. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించిందని.. తాను భయంతో ఆ శవాన్ని మాయం చేసే ప్రయత్నం మాత్రమే చేశానని మొదటి నుంచి అతను వాదించాడు. కానీ, ఆధారాలు అన్నీ అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి.

ఆమెను గొంతు నులిమి హత్య చేసిన థామస్.. గర్భాశయాన్ని తొలగించి ఆ తర్వాత పెరట్లోని రంపంతో ముక్కలుగా కత్తిరించాడని.. ఆపై మిక్సర్‌లో వేసి ముద్దగా మార్చేశాడని.. అందులో కొంత భాగాన్ని రసాయనాల్లో వేసి కరిగించేశాడని తెలిపారు. నేరానికి ఉయోగించిన రంపాన్ని, తోలు భాగాన్ని, ఎముకల అవశేషాల్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ ఘోరాన్ని అతను యూట్యూబ్ వీడియోలు చూస్తూ చేశాడని వెల్లడించారు.
శరీరం నుంచి నడుమ జాయింట్లను విరిచేసి.. మెడ, వెన్నెముకను కోసేసి.. చివరకు ఆమె తలను వేరు చేసి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. శవపరీక్షలో అత్యంత భయానకమైన ఈ వివరాలు వెల్లడయ్యాయి అని కోర్టుకు దర్యాప్తు అధికారులు సమర్పించిన వివరాల్లో ఉంది.
క్రిస్టియానా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీ గురించి తీవ్రంగా ప్రయత్నించారు. నెలలు గడిచినా ఆమె ఆచూకీ కానరలేదు. అయితే.. క్రిస్టియానా జుట్టుకు సంబంధించిన అవశేషాలను లాండ్రీ రూమ్‌లో ఆమె తండ్రి గుర్తించడం ఈ కేసును అసలు మలుపు తిప్పింది. ఆ ఘటన తర్వాత ఎలాంటి కంగారు లేకుండా ఉన్నాడని.. అది అతనిలోని క్రూరత్వానికి ప్రతీకగా నిలిచిందని పోలీసులు తమ నివేదికలో వివరించారు. భర్తే హంతకుడిగా తేలడంతో ఈ కేసు ట్రయల్ జరగాల్సి ఉంది.
మిస్ నార్త్‌వెస్ట్ స్విట్జర్లాండ్ క్రిస్టియానా జోక్సిమోవిక్.. 2007లో మిస్ స్విట్జర్లాండ్ పోటీల్లో ఫైనలిస్ట్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వత క్యాట్‌వాక్ కోచ్‌గా మారి.. అనేక మంది మోడల్స్‌కు శిక్షణ ఇచ్చింది.
పై కేసు చదువుతుంటే.. భార్యను కుక్కర్‌లో ఉడికించిన కేసు గుర్తొచ్చిందా?.. ఆ కథనమూ చదివేయండి 👉 హైదరాబాద్ మీర్‌పేటలో కిరాతకం


