ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
నల్లగొండ, మర్రిగూడ: పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్‌లో జరిగింది. టూటౌన్ ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కొట్టాల గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, రమణమ్మ దంపతుల కుమార్తె శ్రుతి (20) నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ.. స్థానికంగా రవీంద్రనగర్‌లోని బీసీ బాలికల హాస్టల్‌లో ఉంటోంది.
శ్రుతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా, ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంటికి వెళ్తానని హాస్టల్ వార్డెన్‌కు లీవ్ లెటర్ రాసి బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. బాత్‌రూమ్‌లో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ ఎస్‌ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రుతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


