ఓట్లప్పుడే వస్తారా? | Panchayat election campaign in Telangana | Sakshi
Sakshi News home page

ఓట్లప్పుడే వస్తారా?

Dec 10 2025 1:39 AM | Updated on Dec 10 2025 1:39 AM

Panchayat election campaign in Telangana

పంచాయతీ ఎన్నికల వేళ.. అభివృద్ధి నోచుకోని గ్రామాలు, తండాల ప్రజలు ఓటుకు దూరంగా ఉంటామని ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎన్నికలు అనగానే వాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సౌకర్యాలు కల్పించేవరకు ఓటెయ్యం
రాయపర్తి/ ఇంద్రవెల్లి: ‘అరవై ఏళ్లుగా తండాలో అన్నీ ఇబ్బందులే.. సౌకర్యాలు వచ్చే వరకు ఓటు వేయం ’అంటూ వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలకేంద్రం శివారులోని గుబ్బెడుబోడుకింది తండావాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లకోసం ఓటు అడగడానికే వస్తున్నారు కానీ ఆ తర్వాత మా తండాను పట్టించుకున్నవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. 

తండాలో 45 ఓట్లు, 60 మంది జనాభా ఉంటుందని, సరైన రోడ్డు, తాగునీటి సౌకర్యం, వీధిస్తంభాలు, విద్య, వైద్యం అందుబాటులో లేవని చెప్పారు. తెలిపారు తండాను రాయపర్తి నుంచి వేరు చేసి జేతురాంతండాలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న అధికారులు మంగళవారం తండాకు చేరుకొని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని, అంతా ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రతిజ్ఞ చేయించారు. అయినా, తాము ఓటింగ్‌లో పాల్గొనబోమని తండావాసులు తేల్చిచెప్పారు. 

ఎన్నికలకు దూరం 
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్‌పూర్, గోపాల్‌పూర్‌గూడ గ్రామస్తులు ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. మంగళవారం గ్రామ సమీపంలోని వాగు వద్దకు వచ్చిన నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామానికి రోడ్డు వేస్తామని, అభివృద్ధి చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు సర్పంచ్‌ అభ్యర్థులు ఎన్నికల ముందు ప్రకటించి ఆ తర్వాత ఎవరూ ఇటువైపు రావడం లేదన్నారు. 

సర్పంచ్‌ అభ్యర్థి కుటుంబానికి పోలీస్‌ భద్రత
చింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లి మండలం రణవెల్లి సర్పంచ్‌ అభ్యర్థిని జాడి దర్శన కుటుంబానికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. దర్శన సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేయగా, ఉపసంహరించుకోవాలని గుర్తుతెలియని వ్యక్తులు దళం పేరిట గురువారం తుపాకీతో బెదిరించి లేఖ అందజేశారు. 

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్, కౌటాల సీఐ సంతోశ్‌కుమార్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్‌ నరేశ్‌ విచారణ చేపట్టారు. అనంతరం దర్శన కుటుంబానికి రక్షణగా రణవెల్లిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇంటి వద్ద ప్రతినిత్యం ఒక ఏఎస్సై లేదా హెడ్‌ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

గుండెపోటుతో సర్పంచ్‌ అభ్యర్థి మృతి
మహబూబాబాద్‌ రూరల్‌ /ములకలపల్లి: కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో మహబూబాబాద్‌ మండలం నడివాడ సర్పంచ్‌గా రాగిపాటి బుచ్చిరెడ్డి (70) బరిలో ఉన్నాడు. సోమవారం రాత్రి వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. 

గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షుడు ఇనుగంటి నాగప్రసాద్‌ (57) నర్సా పురం పంచాయతీలోని 8వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. 

పంచాయతీ ప్రచారంలో మహిళలు...
ఖాళీగా పల్లె వెలుగు బస్సులు 
కోదాడ: నిత్యం రద్దీతో ఉండే పల్లె వెలుగు బస్సు లకు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రయాణి కుల సంఖ్య తగ్గింది. పది రోజుల క్రితం వరకు కా లు పెట్టడానికి కూడా స్థలం ఉండేది కాదు. గ్రామా ల్లో ఎన్నికల ప్రచారంలో మహిళలు ముమ్మరంగా పాల్గొంటుండటంతో బస్సుల్లో ప్రయాణించేవారు బాగా తగ్గిపొయారు. ప్రచారానికి వెళ్లేవారికి రోజు కు రూ.500 వరకు ఇస్తుండడం కూడా ఓ కారణం. 

పంచాయతీ ఎన్నికల హడావుడి ప్రారంభం కాక ముందు సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపోలో ఉన్న పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండేదని.. ప్రస్తుతం అది సగానికి పడిపోయిందని ఆర్టీసీ వర్గాలు అంటు న్నాయి. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్టీసీ అధికారులు రోజువారి ట్రిప్పుల సంఖ్యను కూడా కుదించారు.

అవినీతి కన్నా.. అడుక్కు తినడం మిన్న
వరంగల్‌లో యాచకులతో వినూత్న ర్యాలీ
హన్మకొండ చౌరస్తా: ‘అవినీతి కన్నా.. అ డుక్కు తినడం మి న్న ’అంటూ జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ సంయుక్త ఆధ్వ ర్యంలో మంగళవారం వరంగల్‌లో యాచకుల తో కలిసి ర్యాలీ నిర్వ హించారు. వేయిస్తంభాల ఆలయం నుంచి హనుమకొండలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. 

లోక్‌సత్తా ఉభయ తెలుగు రాష్టాల అధ్యక్షుడు బండారు రామ్మోహన్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్‌ వీవీ రావు, లోక్‌సత్తా సంస్థ సభ్యు డు శ్రీనివాసరెడ్డి, ఎల్‌బీ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఫ్యామిలీ పంచాయతీ 
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సూద న్‌పల్లి సర్పంచ్‌ పదవికి పోటీలో తల్లీకూతురుతోపాటు అల్లుడి అన్న కోడలు రంగంలో ఉన్నారు. సూదన్‌పల్లి సర్పంచ్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. అయితే ఆరుగురు పోటీలో ఉన్నారు. వీరిలో తల్లీకూతురు ఆకారపు లచ్చమ్మ, తిక్క శైలజతోపాటు తిక్క మాధవి (శైలజ భర్త సోదరుడి కోడలు) కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా, ఆకారపు లచ్చమ్మ 2006–2011 వరకు సర్పంచ్‌గా పనిచేశారు.

పంపిణీకి కాదేది అనర్హం 
పర్వతగిరి/సంగెం: పంచాయతీ ఎన్నికల ప్రలోభాల్లోనూ చిత్ర విచిత్రాలు జరుగు తున్నాయి. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో మహిళలను ఆకట్టు కునేందుకు ముగ్గు, చాయ్‌పత్త ఉచితంగా ఇస్తున్నారు. చేపలు కూడా పంపిణీ చేస్తున్నారు. 

గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లవాయి నుంచి రేషన్‌ బియ్యాన్ని తన సొంత ట్రాక్టర్‌లో తీసుకొచ్చి గ్రామంలో పంపిణీ చేసేలా చూస్తానని వరంగల్‌ జిల్లా సంగెం మండలం ముమ్మడివరం సర్పంచ్‌ అభ్యర్థి ఇజ్జగిరి అశోక్‌ ఓటర్లకు హామీ ఇస్తూ తన మేనిఫెస్టోను విడుదల చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement