దేశ విదేశాల నుంచి తరలివచ్చిన 2 వేలమంది ప్రముఖులు
నేటి నుంచి 4 రోజుల పాటు సాధారణ ప్రజానీకానికి అనుమతి
సాక్షి, హైదరాబాద్/ రంగారెడ్డి జిల్లా: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం ఇందుకోసం సుమారు 25 రోజుల పాటు సర్వశక్తులూ కేంద్రీకరించి శ్రమించింది. ఫ్యూచర్ సిటీలో జరిగిన ఈ సదస్సు తెలంగాణ సత్తాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటేలా సాగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండురోజుల సదస్సులో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, ఒప్పందాలపై దిగ్గజ సంస్థల ప్రకటనలు చేయడం గమనార్హం.
సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో..
ఫ్యూచర్ సిటీలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో సదస్సు నిర్వహణ ఏర్పాట్లు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో స్టార్ హోటల్ వసతులను తలపించేలా రెండు ప్రధాన హాళ్లు, మరో ఆరు అనుబంధ సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. అతిథులు, ప్రతినిధులకు ఆహ్వానం, వసతి, రవాణా, భోజనం సహా ఎక్కడా లోటు రాకుండా ఏర్పాట్లు జరిగాయి. ప్రముఖులను శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సదస్సు ప్రాంగణానికి రప్పించేందుకు మూడు ప్రత్యేక హెలిపాడ్లు నిర్మించారు.
ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, పూలతోటలను సృష్టించారు.
మొత్తం 45 స్టాళ్లు..: 14 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సమావేశ ప్రాంగణం నిర్మాణం కాగా, ప్రభుత్వ ప్రైవేటు సంస్తలు ఎగ్జిబిషన్‌లో 45 స్టాళ్లు ఏర్పాటు చేశాయి. డిజిటల్, ఏఐ, 3 డి సాంకేతికత మేళవింపుతో ఆహూతులను అబ్బురపరిచేలా ఏర్పాటు చేసిన స్టాళ్లు తెలంగాణ, హైదరాబాద్ భవిష్యత్ ప్రగతిని కళ్ల ముందు సాక్షాత్కరింప చేశాయి. నెట్‌జీరో సిటీ, రక్షణ శాఖ, మూసీ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిజిటల్ తెరలతో కూడిన డిజిటల్ టన్నెల్, రోబో, మూసీ టన్నెల్, ఏరోస్పేస్ స్టాళ్ల వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్యూచర్‌సిటీ, మూసీ, గ్రీన్ ఎనర్జీ, ఏవియేషన్, ఉద్యానవన, లైఫ్ సైన్సెస్, హ్యాండ్‌లూమ్స్, పర్యాటక సాంస్కృతిక, రక్షణ, భద్రత విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ వీక్షకులతో నిండిపోయాయి.
తరలివచ్చిన పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రీడాకారులు
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సుమారు 5 వేల మందికి ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అయితే భారత్ సహా 40కి పైగా దేశాల నుంచి సుమారు 2 వేల మంది అతిథులు, ప్రతినిధులు రెండు రోజుల సదస్సుకు హాజరైనట్లు అంచనా. అలాగే పారిశ్రామికవేత్తలు బాలీవుడ్, టాలీవుడ్ తారలు పాల్గొన్నారు.
యువ పారిశ్రామికవేత్తలు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాంగణమంతా కలియ తిరిగారు. సినీ తారలు అర్జున్ కపూర్, చిరంజీవి, సినీ నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్‌బాబు, శ్యాం ప్రసాద్‌రెడ్డి, రాకేష్ ఓం ప్రకాష్, జోయ అక్తర్, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్, ప్రముఖ కీడ్రాకారులు అనిల్‌కుంబ్లే, పీవీ సింధూ, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల తదితరులు సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. సందర్శకులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సిబ్బంది వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
క్విజ్ కాంటెస్ట్‌లో డీజీపీ
ఇంధన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నెట్ జీర్ సిటీ క్విజ్’ కాంటెస్ట్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి పాల్గొన్నారు. సదస్సులో 27 అంశాలపై తెలంగాణ స్తితిగతులు, అభివృద్ధి, భవిష్యత్తు అవకాశాలు, పెట్టుబడులకు సంబంధించి చర్చా గోష్టులు జరిగాయి.
తెలంగాణ రుచులు.. ప్రత్యేక కానుకలు
సదస్సుకు హాజరైన అతిథులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పేలా ఇక్కత్ శాలువాలు, హైదరాబాద్‌కు ప్రత్యేకమైన ముత్యాల అభరణాల గిఫ్ట్‌బాక్స్, అత్తరు అందజేశారు. హైదరాబాద్ బిర్యానీ, ఇతర 50 రకాల వంటకాలను రుచి చూపించారు. రెండురోజుల పాటు సాయంత్రం వేళల్లో సంగీత దర్శకులు కీరవాణి సంగీత కచేరీ, సామల వేణు మేజిక్ ప్రదర్శన నిర్వహించారు. డ్రోన్ షో, బాణసంచా ప్రత్యేక ఆక ర్షణగా నిలిచాయి. రెండురోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి సభా ప్రాంగణంలోనే మకాం వేశారు. సుమారు 2,500 మంది పోలీసులు, వేయి సీసీ కెమెరాలతో నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు స్కూల్ విద్యార్థులను, ప్రజలను గ్లోబల్ సదస్సు ప్రాంగణం సందర్శనకు అనుమతించనున్నారు. ఇందుకోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు.
ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో ఉపాధి అవకాశాలు
ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో ఉపాధి అవ కాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సంబంధిత కోర్సుల అవసరం చాలా ఉంది. అందువల్ల ప్లస్ టు దశలోనే ఈ కోర్సులను ప్రవేశ పెట్టా లని భావిస్తున్నాం. ప్రస్తుతం కొన్ని కోర్సులను మాత్రమే నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ నాటికి స్కిల్స్ వర్సిటీ పూర్తవుతుంది. ఆ తర్వాత మరిన్ని కోర్సులను తీసుకొస్తాం. – వీఎల్‌వీఎస్‌ఎస్ సుబ్బారావు, వీసీ, స్కిల్స్ వర్సిటీ
పెట్టుబడిదారులను ఎంత గౌరవిస్తే అంత మేలు
పెట్టుబడి దారులను ఒకప్పుడు శత్రువులుగా చూసేవారు. ప్రస్తుత సమాజంలో ప్రభుత్వం కన్నా..పెట్టుబడి దారులే పవర్çఫుల్‌గా మారారు. ప్రభుత్వం వద్ద లేనంత సంపధ వీరి వద్దే ఉంది. పెట్టుబడిదారులను ఎంత గౌరవిస్తే..సమాజానికి అంత మేలు జరుగుతుంది. – నర్రా రవికుమార్, జాతీయ చైర్మన్, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( డిక్కి)


