అదే నా పాలసీ డాక్యుమెంట్.. అదే ప్రజలతో నా ఒప్పందం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ –2025 ముగింపులో సీఎం రేవంత్‌రెడ్డి.. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
బాల్యంలో పేదరికం, అంటరానితనాన్ని చూశా..
ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇన్‌ఫర్మేషన్ తమ ప్రాధాన్యతలన్న ముఖ్యమంత్రి
సమ్మిట్ ద్వారా తెలంగాణ ఆశయాలకు వేదికను నిర్మించాం: భట్టి
‘గ్లోబల్ సినీ హబ్’ సాధనకు సహకరిస్తాం: సినీ నటుడు చిరంజీవి
మానవ మేధస్సును యంత్రాలు రిప్లేస్ చేయలేవు: ఆనంద్ మహీంద్రా
తెలంగాణ అన్‌బీటబుల్: ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి
తెలంగాణ గాథ ఆదర్శం కావాలి: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్
సాక్షి, హైదరాబాద్: ‘నా బాల్యంలో పేదరికం, అంటరానితనాన్ని స్వయంగా చూశా. సమస్య ఏమిటో తెలుసు. నేను రైతుబిడ్డను. నాకు పేదరికం తెలుసు. కొందరు నేతలకు పేదరికం విహారయాత్ర లాంటిది. పేదలు ఎలా ఉంటారో చూడటానికి హైదరాబాద్ నుంచి మెర్సిడెజ్ బెంజ్ కారులో చిన్న గ్రామాలకు వెళ్తారు. అంటరానితనం ఉన్నచోట నుంచి.. ఆలయాల్లో కొందరిని రానీయని చోటు నుంచి వచ్చాను. పేదలు, నిరక్షరాస్యులు, నిరుద్యోగులు ఏం కోరుకుంటారో అన్ని తెలుసు. పేదరికం, నిరక్షరాస్యత, అంటరానితనం నిర్మూలనే నా లక్ష్యం. అదే నా పాలసీ డాక్యుమెంట్. అదే ప్రజలతో నా ఒప్పందం. ఇది నా రాష్ట్రానికి, యువతకు మార్గదర్శకంగా మారుతుంది’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో మంగళవారం రాత్రి నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047ను రేవంత్ ఆవిష్కరించారు. ‘నేను ప్రభుత్వ పాఠశాలలో, తెలుగు మాధ్యమంలో చదివాను. కార్పొరేట్ బడిలో ఇంగ్లిష్ మీడియంలో కాదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలతో వ్యక్తిగత సంబంధాలున్నాయి. నాకు రాజకీయ నేపథ్యం లేదు. పేద కుటుంబం నుంచి వచ్చా. 2006లో జెడ్పీ సభ్యుడిగా ఎంపికై ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయిన. 17 ఏళ్లకు సీఎం అయిన’ అని గుర్తు చేసుకున్నారు. పేదలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. విజన్ డాక్యుమెంట్–2047 తయారీలో సహకరించిన ఐఎస్‌బీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, నీతి ఆయోగ్, సూచనలు ఇచి్చన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అందుకే విజన్ డాక్యుమెంట్..
‘తెలంగాణ రాష్ట్రానికి గొప్ప చైతన్యం ఉంది. జల్ జమీన్ జంగల్ అని కుమ్రం భీమ్ పోరాడితే.. సాయుధ రైతాంగ పోరాటంలో భూమి, భుక్తి, విముక్తి కోసం వేలాది మంది పోరాడి నేలకొరిగారు. ఆ స్ఫూర్తితోనే మన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సోనియా, మన్మోహన్ నెరవేర్చినా, ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించేందుకు అవసరమైన సామర్థ్యాలు మనకున్నా గతంలో సాధించలేకపోయాం. నేడు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. వాటిని అందించాలనే తెలంగాణ విజన్–2047 డాక్యుమెంట్‌ను తెచ్చాం.
దేశం 2047లో 100 ఏళ్ల స్వాతం్రత్యాన్ని జరుపుకోనుండగా, ఆలోగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెంది వికసిత్ భారత్ లక్ష్య సాధనతో ముందుండాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ జనాభాలో 2.9 శాతం వాటా కలిగి ఉన్న మన రాష్ట్రం దేశ జీడీపీలో 5 శాతం వాటాను కలిగి ఉంది. 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగి దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచడానికి విజన్ డాక్యుమెంట్ తెచ్చాం’ అని సీఎం రేవంత్ అన్నారు.
లక్ష్యాలు ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్..
‘విజన్ డాక్యుమెంట్ నాలుగు గోడల మధ్య తయారు చేసిన కాగితం కాదు. నాలుగు కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలోని మేధావులతో చర్చించి, ఆర్థికవేత్తలు, రైతులు, మహిళలు, విద్యార్థులను భాగస్వాములను చేసి రూపొందించిన విధాన పత్రం. నెహ్రూ దేశ తొలి ప్రధానిగా బాధ్యతల స్వీకరణకు ముందు గాంధీని కలిసి సలహా కోరగా, పాలనాపర నిర్ణయం తీసుకునే సమయంలో పేదలు, నిస్సహాయులకు ఎలా సహాయం చేయగలవో ఆలోచించాలని సలహా ఇచ్చారు. ఆ సూచనలతో నిరక్షరాస్యత నిర్మూలనకు విద్య, ఆకలి నిర్మూలనకు ఇరిగేషన్ అని విధాన నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో భాగంగా అనేక వర్సిటీలు, ప్రాజెక్టులను నిర్మించారు. దేశంలో బాక్రనంగల్, రాష్ట్రంలో ఎస్సారెస్పీ వంటివి నెహ్రూ కాలంలోనే ప్రారంభించారు.
మా ప్రభుత్వం విద్య, ఇరిగేషన్‌తోపాటు కమ్యూనికేషన్‌ను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించింది. ఐటీ, రోడ్లు, పోర్టుల ద్వారా ప్రపంచంతో కమ్యూనికేట్ కావాలని నిర్ణయించాం. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహా్వనిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్ నాకు ఆదర్శం. వాటితో పోటీపడతా. వారిని ఆదర్శంగా తీసుకుని నా రాష్ట్రాన్ని అభివృద్ధిచేస్తా. సంక్షేమ పథకాలు అమలు చేస్తా’ అని రేవంత్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజల సగటు వయస్సు 32 ఏళ్లు కాగా నెహ్రూ విజన్ కారణంగా ఇప్పుడు 73 ఏళ్లకు పెరిగిందన్నారు. వందేళ్ల సగటు ఆయుష్షును సాధించాలని అనుకుంటున్నామన్నారు. నిరుపేదలకు, మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామన్నారు. ‘11 ఏళ్ల వయస్సులో పెద్ద ప్రమాదానికి గురైతే నా తల్లిదండ్రులు నన్ను గ్రామం నుంచి నిజాం నిర్మించిన ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పేదరికాన్ని నిర్మూలించాలని, విద్యను అందించాలని, ఉద్యోగాలు యువతకు ఇవ్వాలని, పౌరులకు మంచి వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
కుల నిర్మూలనకే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
‘కుల నిర్మూలనకు పనిచేయాల్సిన ప్రభుత్వాలే ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీ హాస్టళ్లను వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. నేను సీఎం అయిన వెంటనే వాటిని ఒకేచోట తేవాలని ఆదేశించా. అందులోభాగంగానే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నా. ఒక్కొక్కటి రూ.200 కోట్లతో 100 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. కులవివక్ష నిర్మూలనకు, సమానత్వం వచ్చే వరకు సంక్షేమంపై పెట్టుబడి అవసరం. విద్యపై ఖర్చు భవిష్యత్తుపై పెట్టుబడే. మన యువత చదువుకుని దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా చేసి కొరియాతో పోటీపడబోతున్నాం. సోనియా గాంధీ తెచ్చిన విద్యా హక్కు చట్టం ఉన్నా నాణ్యమైన విద్య అందడం లేదు. యువతలో నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ తెచ్చాం. 140 కోట్ల జనాభా ఉన్నా ఒలింపిక్స్‌లో ఒక్క బంగారు పతకం గెలవలేకపోతున్నాం. దీనికోసమే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ తెస్తున్నా. నా నిరుపేదల కోసం ఇదే నా విధానం’ అని సీఎం ప్రకటించారు.


