తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గ్లోబల్ సమ్మిట్‌లో ‘3 ట్రిలియన్ డాలర్ దిశగా పెట్టుబడులు, ఉత్పాదకతల
పరపతి’పై చర్చాగోష్టిలో ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో తీర్చిదిద్దిన విజన్ డాక్యుమెంట్ కేవలం ఒక పత్రం కాదని.. తెలంగాణ భవిష్యత్తు కోసం తాము చేసే ప్రతిజ్ఞ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంగళవారం ‘3 ట్రిలియన్ దిశగా తెలంగాణ: పెట్టుబడులు, ఉత్పాదకతల పరపతి’అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిని ఆయన ప్రారంభించారు. ‘ప్రస్తుతం తెలంగాణ 185 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. అది 3 ట్రిలియన్ డాలర్లకు చేరాలంటే 16 రెట్లు పెరగాలి.
సాధారణ వృద్ధిరేటు సాధిస్తూ వెళ్తే 2047 నాటికి 1.12 ట్రిలియన్ డాలర్ల వరకే వెళ్లగలం. అంటే లక్ష్యానికి, పరిస్థితులకు మధ్య ఉత్పాదకత అంతరం ఉంది. రోడ్లు, భవనాలు కట్టి ఈ అంతరాన్ని పూడ్చాలని మేం అనుకోవట్లేదు. ఆర్థిక వ్యవస్థ మూల సూత్రాన్ని మార్చగలిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. పెట్టుబడి, ఆవిష్కరణలు కలిస్తేనే ఉత్పాదకత వస్తుంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రూపాంతరం చెంది ఈజ్ ఆఫ్ ఇన్నోవేషన్స్‌గా మారాలి. ప్యూర్, క్యూర్, రేర్ వ్యవస్థలు సహకరించాలి. ఇక్కడ ప్రణాళిక, ప్రతిభ ఉంది కానీ ఆవిష్కరణలు చాలా ఖరీదైనవి. అవి చాలా ఏళ్లపాటు ఆర్థిక ఫలితాలనివ్వవు. అందుకే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నియంత్రించే వ్యవస్థలా కాకుండా ఉ్రత్పేరకంగా, భాగస్వామిగా మారాల్సి ఉంటుంది. మేం హైదరాబాద్‌ను ఆసియా ఇన్నోవేషన్ హబ్‌గా మార్చాలనుకుంటున్నాం’అని భట్టి చెప్పారు.
సానుకూల దృక్పథంతోనే సాధ్యం: ట్రాన్స్‌కో సీఎండీ
2047 నాటికి మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందాలని తెలంగాణ నిర్ణయించుకున్న లక్ష్యం ఆర్థిక వ్యవస్థలోనే గతంలో ఎన్నడూ లేదని.. అలాంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే చేయాలనే దృక్పథం ఉన్నప్పుడే సాధ్యమవుతుందని ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్ చెప్పారు. ఐఐటీలో చదివిన ఇంజనీర్‌గా, ఆర్థిక శా్రస్తాన్ని చదివిన నిపుణుడిగా, ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఎదురయ్యే సవాళ్లు తెలిసిన వ్యక్తిగా పలు అంశాలపై విశ్లేషించారు.
చర్చాగోష్టిని సమన్వయం చేసిన ఐఎస్‌బీ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ ఆదిత్య కువలేకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఐఎస్‌బీ ఫైనాన్స్ ఫ్యాకల్టీ ప్రసన్న తాంత్రి మాట్లాడుతూ ఆవిష్కరణలను విలాసంగా భావించకుండా అవసరంగా పరిగణించాలన్నారు.
గ్రావ్‌టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ పరశురాం పాక మాట్లాడుతూ తాను అమెరికా నుంచి భారత్‌కు వచ్చినప్పుడు స్టార్టప్‌ల రంగంలో ఆర్థిక, మానవ వనరుల పరంగా ఇబ్బందులు పడ్డానని.. అయినా ఫలితంపై శ్రద్ధతో చివరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేయగలిగామని చెప్పారు. ఇజ్రాయెల్ అవలంబిస్తున్న స్టార్టప్‌ల ప్రోత్సాహక విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని సూచించారు.


