3 మూల స్తంభాలు 10 వ్యూహాలు.. | Key points in Telangana Vision Document 2047 | Sakshi
Sakshi News home page

3 మూల స్తంభాలు 10 వ్యూహాలు..

Dec 10 2025 1:50 AM | Updated on Dec 10 2025 1:50 AM

Key points in Telangana Vision Document 2047

తెలంగాణ రైజింగ్‌ విజన్‌– 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందిస్తున్న రోబో. చిత్రంలో సినీ నటుడు చిరంజీవి, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర, నీతి ఆయోగ్‌ సీఈఓ సుమన్‌ బేరీ, మాజీ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వయిజర్‌ ప్రొఫెసర్‌ అరవింద్‌ సుబ్రమణ్యం, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోరి్నయా ప్రొఫెసర్‌ కార్తీక్‌ మురళీధరన్, సీఎస్‌ రామకృష్ణారావు

తెలంగాణ దార్శనిక పత్రం–2047లో కీలకాంశాలివే 

83 పేజీల విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి 

2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనే లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: రెండు దశాబ్దాల అనంతర అద్భుత స్వప్నాన్ని కాంక్షిస్తూ వికసిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2047 దార్శనిక పత్రాన్ని (విజన్‌ డాక్యుమెంట్‌) రూపొందించింది. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధితో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం 10 వ్యూహాలను ఇందులో పొందుపరిచింది. ముచ్చటగా 3 మూల స్తంభాల సాయంతో 13 గేమ్‌ చేంజర్‌ ప్రాజెక్టులను తీర్చిదిద్దడం ద్వారా 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

పాలనలో విశిష్టత, సేవలకు గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో రాష్ట్రానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పరిపుష్టం చేసుకోవడంతో పాటు నిరంతర సంపద సృష్టి ధ్యేయంగా 83 పేజీల డాక్యుమెంట్‌ను.. ఫ్యూచర్‌ సిటీలోని గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మానవ రూపంలోని రోబో వేదికపై నడుచుకుంటూ వచ్చి సీఎంకు ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను అందజేయడం అతిథులను ఆకట్టుకుంది.  

ప్రగతి కోసం పది వ్యూహాలు 
1. ముఖ్య సిద్ధాంతం.. 3 జోన్ల రాష్ట్రం 
రాష్ట్రాన్ని 3 ముఖ్య జోన్లుగా విభజించుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. సుమారు 160 కిలోమీటర్ల ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపలి భాగంలో సేవల రంగం కేంద్రీకృతంగా హరిత మెట్రోపొలిస్‌ కోసం కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌), ఓఆర్‌ఆర్‌కు అవతల, 360 కిలోమీటర్ల రీజనల్‌ రింగు (ట్రిపుల్‌ ఆర్‌) రోడ్డు లోపలి భాగంలో తయారీ రంగంపై ఫోకస్‌ చేస్తూ పెరీ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (ప్యూర్‌), ట్రిపుల్‌ ఆర్‌ ఆవలి భాగంలోని గ్రామీణ తెలంగాణలో వ్యవసాయ ఆధారిత రంగాల అభివృద్ధి లక్ష్యంగా రూరల్‌ అగ్రి రీజియన్‌ ఎకానమీ (రేర్‌) ఏర్పాటు.

2. సులభతర విధానాల దిశగా..
గత రెండేళ్ల కాలంలో తాత్కాలిక ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకునే దశ నుంచి పారదర్శకంగా, వేగంగా విధాన నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చాం. ఈ రెండేళ్ల కాలంలో ఇందుకు అనుగుణంగా క్రీడలు, పర్యాటకం, విద్య, పరిశ్రమలు, పెట్టుబడులు, సామాజిక సమ్మిళిత రంగాల్లో విధానాలు తీసుకువచ్చాం. ఈ విధానాలు అద్భుత ఫలితాలనివ్వడంతో పాటు చెప్పుకోదగిన మార్పును ప్రతిబింబిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి ప్రజల జీవనంలోని ప్రతి కోణంలోనూ వారి ప్రతి అవసరం తీరే విధంగా సులభతర విధానాలను తీసుకువస్తాం.

3. గేమ్‌ చేంజర్‌ ప్రాజెక్టులు 
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాకుండా ప్రపంచంలోనే ఉత్తమ నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్, తెలంగాణను తీర్చిదిద్దేందుకు గేమ్‌ చేంజర్‌ ప్రాజెక్టులను ఎంచుకున్నాం.

4. పాలనలో విశిష్టత... సేవలకు గ్యారంటీ 
ప్రభుత్వం, భాగస్వామ్య పక్షాల మధ్య లావాదేవీలు నేరుగా కాకుండా డిజటల్‌ రూపంలో జరిగేలా డిజిటల్‌ పాలన. రాష్ట్రంలోని పౌరులందరికీ అందుబాటులో ఇంటర్నెట్, డేటా. రాష్ట్రమంతటా భూగర్భ కేబుల్, వైఫై జోన్ల ఏర్పాటు. స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్, ఎఫెక్టివ్‌ డెలివరీ (స్పీడ్‌) పద్ధతిలో సేవలందేలా పెట్టుబడులను ఆకర్షించే వ్యూహం.  

5. నాలెడ్జ్‌ హబ్‌ 
టెక్, బయోటెక్, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థలు, పరిశోధక సంస్థలతో కలిపి నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పా టు. ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌ల ఏర్పాటు, విద్యార్థుల మార్పిడి, ఫ్యాకల్టీ, పరిశోధక సామాగ్రి సమకూర్చుకోవడం కోసం అంతర్జాతీయ విద్యా సంస్థలను ఆహ్వానించడం ద్వారా క్యూర్‌ పరిధిలో నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు.  

6. సమ్మిళిత, సుస్థిర సంక్షేమం
రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ సమానమే అయినా మూడు ముఖ్యమైన వర్గాల సంక్షేమంపై రాష్ట్రం దృష్టి. మహిళలు, రైతులు, యువత–చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు. విద్య, వైద్య రంగాలతో పాటు ప్రజల జీవనోపాధి పెంపు, ఆర్థిక సాధికారత కోసం దీర్ఘకాలిక వ్యూహాలకు రూపకల్పన.  

7. అభివృద్ధి వనరులు 
ప్రపంచ స్థాయి విశ్వస నీయ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం ద్వారా వారికి భరోసా కలి్పంచడం, సుస్థిర అభివృద్ధి వలయం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నిరంతర సంపద సృష్టి ధ్యేయంగా ప్రభు త్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లడం.  

8. పర్యావరణం సుస్థిరత 
ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ పర్యావర ణ పరిస్థితులు, వాతావరణ మార్పుల వల్ల నష్ట సంభావ్యత గురించి ఆలోచిస్తున్నారు. వాటర్‌ గ్రిడ్, భూగర్భ డ్రైనేజీ, చెరువుల పునరుద్ధరణ, వరద నష్టాల బారిన పడకుండా హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టాలి. గోదావరిని మూసీతో అను సంధానం చేయడం ద్వారా రాబోయే 75–100 ఏళ్ల వరకు నీటి కొరత లేకుండా కరువు బారిన పడకుండా చూడటం. 

9. సంస్కృతి 
సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్ర, స్మారక చిహ్నాలు, కళలు, జానపదాలకు ప్రోత్సాహమందించడం.  

10. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన.. 
రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సమర్థతలకు అనుగుణంగా విజన్‌ రూపొందించాం. ఇది కేవలం నిపుణులతో సాధ్యం కాలేదు. 4 లక్షల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. వారి నుంచి సమస్యలు, అంతర్గతంగా దాగి ఉన్న బలాలు, అత్యంత క్లిష్టమైన లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సామూహిక చైతన్యం గురించి తెలుసుకోగలిగాం. తెలంగాణ రైజింగ్‌ నిరంతరం సాగుతూనే ఉంటుంది. రండి..అభివృద్ధిలో భాగస్వామి కండి. 

13 గేమ్‌ చేంజర్‌ ప్రాజెక్టులివే.. 
»  భారత్‌ ఫ్యూచర్‌ సిటీ 
» మూసీ పునరుజ్జీవనం 
» డ్రైపోర్టు 
» డ్రైపోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు  12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే 
» బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నైకు హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లు 
» ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ ఆర్‌ మధ్యలో తయారీ రంగం అభివృద్ధి 
» రీజనల్‌ రింగు రోడ్డు 
» ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ ఆర్‌లను కలుపుతూ రేడియల్‌ రోడ్లు 
» రీజనల్‌ రింగ్‌ రైల్వే 
» వ్యవసాయ భూములకు గ్రీన్‌ ఎనర్జీ 
» ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్స్‌ 
» గ్రీన్‌ ఎనర్జీ హబ్స్‌ 
» ఎల్రక్టానిక్‌ వాహనాలను పెద్ద సంఖ్యలో వినియోగించడం

3 మూలస్తంభాలివే.. 
1. ఆర్థిక వృద్ధి..
ఆవిష్కరణలు, ఉత్పాదకతల పునాదులపై జరిగే అభివృద్ధి ఆధారంగా క్యూర్‌–ప్యూర్‌–రేర్‌ విధానంతో 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన. 

2. సమ్మిళిత అభివృద్ధి..
ఈ వృద్ధి ఫలాలను యువత, మహిళలు, రైతులు, అట్టడుగున ఉన్న వర్గాలు, సమాజంలో అన్ని  వర్గాలకు అందించడం.

3. సుస్థిర అభివృద్ధి..
హరిత మార్గంలో 2047 నాటికి అన్ని రంగాల్లో సుస్థిరత.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement