పెళ్లయిన మూడు రోజులకే నవ వధువు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో గోరఖపూర్‌లో ఈ ఘటన జరిగింది. శారీరకంగా అసమర్థుడైన వ్యక్తితో తాను జీవితాన్ని గడపలేను అంటూ కొత్త పెళ్లికూతురు లీగల్ నోటీసు పంపించింది.
వరుడు సహజన్వాలోని రైతు కుటుంబానికి చెందిన ఏకైక కుమారుడు. వయస్సు 25. జిఐడిఎలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బేలియాపర్‌లోని బంధువుల ద్వారా ఈ వివాహం నిశ్చయమైంది. బంధు మిత్రులు సమక్షంలో నవంబర్ 28న వీరి వివాహం జరగింది. సాంప్రదాయం ప్రకారం మరుసటి రోజు అత్తవారింటికి సాగనంపారు. సాధారణంగా పెళ్ళిళ్లలో జరిగే తంతు ప్రకారం డిసెంబర్ 1న మూడో రోజు ఫస్ట్ నైట్ కార్యక్రమానికి ముహర్తం పెట్టారు. కానీ ఆ రాత్రే ఆమెకు చేదు అనుభవాన్ని మిగిలుస్తుందని ఆమె ఊహించి ఉండదు. పెళ్లయిన మొదటి రాత్రి కోటి ఆశలతో గదిలోకి అడుగుపెట్టిన ఆమెకు స్వయంగా భర్తే బాంబు పేల్చాడు. తాను వైవాహిక సంబంధాలకు శారీరకంగా అసమర్థుడిని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఆమె హతాశురాలైంది. తరువాత ఇంట్లోని పెద్దలకు అసలు విషయం చెప్పింది. వెంటనే ఆమెను తిరిగి పుట్టింటికి తీసుకువచ్చారు. క్షణం ఆలస్యం చేయకుండా లీగల్ నోటీసు పంపింది.
డిసెంబర్ 3న బేలియాపర్‌లో ఇరుపక్షాలు కలుసుకున్నాయి. వరుడి పరిస్థితిని దాచిపెట్టారని వధువు కుటుంబం ఆరోపించింది. అంతే కాదు ఇది అతని రెండవ విఫల వివాహమని, రెండేళ్ల క్రితం మొదటి వధువు నెల రోజుల్లోనే విడిచిపెట్టి వెళ్లిపోయిందని కూడా వారు పేర్కొన్నారు.
ఇరుపక్షాల సమ్మతితో, వరుడికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అతడు శారీరంగా అసమర్థుడని, "తండ్రి కాలేడు" అనివైద్యపరీక్షలు కూడా నిర్ధారించాయి. దీంతో పెళ్లి బహుమతులు ఖర్చులన్నింటినీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీన్ని వారు తిరస్కరిండంతో వధువు కుటుంబం సహజన్వా పోలీసులను ఆశ్రయించి, అన్ని బహుమతులు మరియు నగదును తిరిగి ఇవ్వాలని కోరింది. పోలీసుల జోక్యంతో, ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరింది. వరుడి కుటుంబం రూ. 7 లక్షలు, అన్ని పెళ్లి బహుమతులను ఒక నెలలోగా తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. బంధువుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారని సహజన్వా ఎస్హెచ్‌ఓ మహేష్ చౌబే వెల్లడించారు.
ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే..


