బీటెక్ విద్యార్థిపై క్రికెట్ బ్యాట్‌తో యువతి తల్లి దాడి
అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందిన యువకుడు
ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే ఘటన
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కలకలం
పటాన్‌చెరు టౌన్: ప్రేమ వ్యవహారం బీటెక్ బీటెక్ విద్యార్థిని బలి తీసుకుంది. మాట్లాడదామని ఇంటికి పిలిచి క్రికెట్ బ్యాట్‌తో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సీఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శ్రావణ్ సాయి (19) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో పెదనాన్న వద్ద ఉంటున్నాడు.
పటాన్‌చెరు మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని సృజన లక్ష్మీసాయి మెడోస్‌లో ఉండే తమరుపల్లి శ్రీజతో ఇతనికి పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. విషయం తెలియడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. అయినా వీరి వైఖరిలో మార్పు కనిపించలేదు. దీంతో పథకం ప్రకారం మాట్లాడేందుకంటూ మంగళవారం అమ్మాయితో ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు.
మాటామాటా పెరిగి..: ప్రేమ విషయమై శ్రీజ తల్లి సిరి, సాయి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి కోపోద్రిక్తురాలైన సిరి క్రికెట్ బ్యాట్‌తో సాయిని, శ్రీజను కొట్టింది. తల, వీపుపై బలంగా దెబ్బలు తగలడంతో సాయి స్పృహ కోల్పోయాడు. శ్రీజకు చేయి విరిగింది. దీంతో తల్లి, సోదరుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుధవారం వేకువజామున ఇంటికి రాగా.. అప్పటికీ ఇంట్లోనే అపస్మారక స్థితిలో ఉన్న సాయిని చూసి వెంటనే నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. సాయి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


