పుట్టినరోజునే మృత్యు ఒడిలోకి
వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి
ధర్మారం: పెద్దపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. తన బర్త్‌డే నాడే నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు సాంబార్ గిన్నెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పుట్టినరోజు వేడుక జరిపేందుకు తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న తరుణంలో కుమారుడు కానరాని లోకాలకు వెళ్లడం పుట్టెడు దుఃఖాన్ని మిగిలి్చంది. ధర్మారం ఎస్సై ప్రవీణ్కుమార్, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మొగిలి మధుకర్ ఏడాదిన్నరగా మల్లాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకులంలో తాత్కాలిక పద్ధతిన వంటమనిషిగా పనిచేస్తున్నాడు. మధుకర్ భార్య శారద, కూతురు శ్రీమహి(8), కుమారుడు మోక్షిత్(4)తో కలిసి విద్యాలయంలోని ఓ గదిలో నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే ఆదివారం వంటగదిలో మధుకర్ వంట తయారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. కాసేపటికి సాంబారు వండి పక్కన పెట్టాడు.
అతడి కుమారుడు మోక్షిత్ ఆడుకుంటూ వంట గదిలోకి వెళ్లాడు. అకస్మాత్తుగా వేడి సాంబారు పాత్రలో పడిపోయాడు. వేడితీవ్రతకు గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తండ్రి మధుకర్.. తొలుత కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం బాలుడు మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. బర్త్‌డే రోజే తమ కుమారుడు కళ్లెదుటే గాయపడి మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బంధువులు రోదించిన తీరు కలచివేఇంది.


