2000లో గుడుంబా డాన్ సుదేశ్ సింగ్ ఎన్‌కౌంటర్
ఆయన డ్రైవర్ వెంకటరత్నం సమాచారం ఇచ్చారని ఆరోపణ
దీంతో ఆయనపై కక్షకట్టిన సుదేశ్ కుమారుడు, బంధువులు
సోమవారం దారికాచి సాకేత్ కాలనీలో దారుణ హత్య
షాహినాయత్‌గంజ్ ఠాణాలో లొంగిపోయిన నిందితులు
సాక్షి, సిటీబ్యూరో/జవహర్‌నగర్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్‌లో దారుణ హత్య చోటు చేసుకుంది. పాతికేళ్ల నాటి పగ తుపాకీ, కత్తులతో విరుచుకుపడింది. అప్పట్లో తన తండ్రి మరణానికి ఆయన డ్రైవరే కారణమని భావించిన వ్యక్తి...బంధువుతో పాటు మరికొందరితో కలిసి విరుచుకుపడ్డాడు. కుమార్తెను పాఠశాల వద్ద వదిలి వస్తున్న మాజీ డ్రైవర్‌ను పట్టపగలు, నడిరోడ్డుపై అడ్డగించి చంపేశాడు. నేరుగా నగరంలోని షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు వచి్చన ఆరుగురు నిందితులు లొంగిపోయారు. వీరిని అధికారులు జవహర్‌నగర్ పోలీసులకు అప్ప
గించారు.
అప్పట్లో డాన్‌గా వ్యవహరించిన సుదేశ్ సింగ్...
నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన సుదేశ్ సింగ్ 1990ల్లో ఓ స్థాయి డాన్‌గా చెలామణి అయ్యాడు. మంగళ్‌హాట్, ధూల్‌పేట, జిర్రా తదితర ప్రాంతాల్లో గుడుంబా వ్యాపారంతో పాటు బెదిరింపు వసూళ్లు, గంజాయి దందాలను తన గుప్పెట్లో పెట్టుకున్న సుదేశ్ సింగ్ పోలీసులనూ పరుగులు పెట్టించారు. ఇతడి వ్యవహారాలు శృతిమించడంతో అప్పటి ఉన్నతాధికారులు కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం 1999లో టాస్‌్కఫోర్స్‌లో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన సుదేశ్ సింగ్ తన సన్నిహితులైన అనుచరులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇతడి ప్రధాన అనుచరుడైన అనిల్ ఆచూకీ కామాటిపుర ప్రాంతంలో గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయతి్నంచారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో అనిల్ చనిపోయాడు.
వెంకటరత్నంనే ఇన్‌ఫార్మర్‌గా అనుమానించి...
ఈ ఎన్‌కౌంటర్‌తో మరింత అప్రమత్తమైన సుదేశ్ సింగ్ తర్వాతి టార్గెట్ తానే అని భావించారు. తన ఉనికి ఎక్కడా బయటపడకుండా ఉండేందుకు అనుచరుల్నీ దూరంగా ఉంచారు. అయినప్పటికీ నాటకీయ పరిణామాల మధ్య 2000 ఏప్రిల్‌లో జిర్రా ప్రాంతంలోని గుట్టలపై జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుదేశ్ సింగ్ చనిపోయాడు. అప్పట్లో నగరానికి చెందిన గంటా వెంకటరత్నం డాన్ సుదేశ్ సింగ్‌కు డ్రైవర్‌గా వ్యవహరించారు. పోలీసులు ఇతడిపై ఒత్తిడి పెంచడంతోనే సుదేశ్ సింగ్ కదలికలపై ఉప్పందించాడని, ఈ కారణంగానే ఎన్‌కౌంటర్ జరిగిందని మృతుడి కుటుంబీకులు భావించారు. దీంతో కొన్నేళ్లుగా సుదేశ్ కుమారుడు చందన్ సింగ్, సమీప బంధువు కక్షతో రగిలిపోయారు. వెంకటరత్నం ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీలో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు.
పక్కా రెక్కీ చేసి, ఆయుధం సేకరించి...
చందన్ తన సమీప బంధువుతో పాటు మరో నలుగురితో కలిసి ముఠా కట్టాడు. సాకేత్ కాలనీలో పక్కాగా రెక్కీ చేసి వెంకటరత్నం కదలికల్ని గమనించారు. ఆపై హత్య పథకాన్ని అమలు చేయడానికి ఓ తుపాకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తన తండ్రి పోలీసు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో వెంకటరత్నాన్ని కూడా కాల్చి చంపాలని చందన్ భావించాడు. షాహినాయత్‌గంజ్ ప్రాంతంలో నివసించే చందన్, అతడి సమీప బంధువు కొన్నాళ్లుగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఓ తుపాకీ ఖరీదు చేసుకుని వచి్చన ఈ ద్వయం సోమవారం మరో నలుగురితో కలిసి రంగంలోకి దిగింది. తుపాకీతో కాల్పులు జరిపినా తప్పించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కత్తులనూ తమ వెంట తెచ్చుకుంది. ఎప్పటిలాగే వెంకటరత్నం తన కుమార్తెను కాప్రాలోని పాఠశాలలో దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఇది గమనించిన చందన్ విషయాన్ని అనుచరులకు సమాచారమిచ్చాడు.
కాపుకాసి దారుణంగా హత్య చేసి..
నలుగురు ఆటోలు ఇద్దరు స్కూటీపై వచ్చి కాపుకాశారు. తన కుమార్తెను స్కూల్‌లో దింపిన వెంకటరత్నం తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ఈయన్ను వెంబడిస్తుండగా ఆటోలో నలుగురు మార్గమధ్యంలో కాపుకాశారు. వీళ్లు కాపుకాసిన ప్రాంతానికి వెంటకరత్నం చేరుకున్న వెంటనే అడ్డగించి దాడికి తెగబడిన ముఠా ముందు కాల్పులు జరిపింది. కిందపడిపోయిన వెంకటరత్నం దగ్గరకు వెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పారిపోయింది. ఛాతి, తల, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన వెంకటరత్నం అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జవహర్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించింది. క్లూస్‌టీం, డాగ్‌స్వాడ్‌లతో హత్యాస్థలిలో ఆధారాలు సేకరించారు. నిందితులు నేరుగా షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు వచ్చి ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు.


