ప్యాలెస్‌లో బస చేయనున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం
అక్కడి నుంచే తన బృందంతో కలిసి ఉప్పల్ స్టేడియానికి
సీఎంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ముగిశాక మళ్లీ ప్యాలెస్‌కే
పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీసు అధికారులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రానున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాతబస్తీలోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌లో బస చేయనున్నారు. అక్కడ నుంచే ఆయన తన బృందంతో కలిసి ఉప్పల్ స్టేడి యానికి వెళ్లి.. సీఎం రేవంత్‌రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఆపై ప్యాలెస్‌కు తిరిగి వచ్చి, ఎంపిక చేసిన ప్రముఖులను కలుసుకుంటారని తెలిసింది. శనివారం మెస్సీ పర్యటన నేపథ్యంలోపోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 1894లో నిజాం నిర్మించిన ఫలక్‌నుమా ప్యాలెస్, 2010లో తాజ్ ఫలక్‌నుమా హోటల్‌గా మారింది.
2014 నవంబర్‌లో సల్మాన్‌ఖాన్ సోదరి అరి్పత ఖాన్ వివాహం ఇందులోనే జరిగింది. 2017 నవంబర్‌లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు తాజ్ ఫలక్‌నుమాలోనే విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మెస్సీ కూడా అందులోనే బస చేయనుండటంతో ఈ ప్యాలెస్ పేరు అంతర్జాతీయ స్పోర్ట్స్ సర్కిళ్లలోనూ మారుమోగనుంది. శనివారమే హైదరాబాద్ రానున్న మెస్సీ, ఆయన టీమ్ నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి తాజ్ ఫలక్‌నుమా హోటల్‌కు వెళ్లి బస చేస్తుంది.
ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ బృందం తిరిగి నేరుగా హోటల్‌కే వెళుతుందని సమాచారం. శనివారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే బస చేసే మెస్సీ, ఆదివారం అక్కడ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి తిరుగు ప్రయాణమవుతారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఆయన పర్యటనలో మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు.
హైదరాబాద్, రాచకొండ కమిషనర్లు వీసీ సజ్జనార్, జి.సుదీర్‌బాబులతో పాటు నగర ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్‌లు మెస్సీ పర్యటనలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఓ పక్క మెస్సీతో పాటు ఆయన బృందం, మరోపక్క సీఎం రేవంత్‌రెడ్డి సహా ఇతర ప్రముఖులు స్టేడియం వద్దకు రావడానికి, తిరిగి వెళ్లడానికి రూట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఓ సవాల్‌గా తీసుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు. పాస్‌లు, టికెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియం పరిసరాల్లోకి అనుమతించనున్నారు.


