ఈ కమిటీ నివేదిక అందాక తదుపరి చర్యలు ఉంటాయి
రెండేళ్ల ప్రజాపాలన ఉత్సవాలకు అనుమతి అడిగితే ఇచ్చాం
నేటి తొలిదశ పంచాయతీల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ
రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యాత్మక ప్రాంతాలు.. అక్కడ బందోబస్తు డబుల్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై వచ్చిన పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదును ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) కమిటీకి పంపించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకు ముదిని వెల్లడించారు. ఈ కమిటీ నుంచి నివేదిక అందాక, దానిపై తదుపరి చర్యలు ఉంటాయని తెలి పారు. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత నుంచి ఎస్‌ఈసీకి ఫిర్యాదు అందిందన్నా రు. రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, విజయో త్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కోరిన అనుమతికి ఆమోదం తెలిపా మని చెప్పారు.
ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి పలు సూచనలు చేశామన్నారు. ఎంసీసీ పర్యవేక్షణకు సీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా కమిటీలు పనిచేస్తు న్నాయని చెప్పారు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ‘మన్‌కీబాత్’కార్యక్రమం తాము రెగ్యులర్‌గా నిర్వహిస్తున్నామని, ఇది గ్రామీణ ప్రాంతాల్లోనూ రేడియోలో ప్రసారం అవుతున్నందున ఆకాశవాణి అధికారు లు అనుమతి కోరారని చెప్పారు. బుధవారం ఎస్ ఈసీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేశ్‌భగ వత్, పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్, రాష్ట్ర ఎన్నికల అధికారి డా.జి.సృజన, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం. మకరందుతో కలిసి రాణీ కుముదిని మీడియాతో మాట్లాడారు.
గురువారం జరగనున్న తొలివిడత ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్టు, ఈ ప్రాంతాల్లో డబుల్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సర్పంచ్, వార్డుల ఏకగ్రీవాలకు సంబంధించి సమీక్ష, అభ్యర్థుల డిక్లరేషన్‌ల ఆధారంగా కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే వీటికి సంబంధించి ఏవైనా ఉదంతాల్లో కేసులు నిరూపితమైతే ఆ ఎన్నికలు రద్దు అవుతాయని, ఏకగ్రీవాలపై ఆరోపణలు వచ్చిన చోట నివేదికలు కోరినట్టు చెప్పారు.
నోటాను అభ్యర్థిగా పరిగణించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఇచ్చిన వినతిపత్రంపై ఎస్‌ఈసీ స్పందన ఏమిటని ఓ విలేకరి కోరగా.. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏమి చేయాలి, సింగిల్ నామినేషన్ వస్తే ఏమి చేయాలి తదితరాలపై వేసిన పిల్‌పై విచారణ సుప్రీంకోర్టులో ఉందని రాణీకుముదిని తెలిపారు. దానిపై వచ్చే తీర్పు లేదా ఆదేశాలకు అనుగుణంగా తాము కూడా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ రోజు ఓటింగ్ తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు.
మహేశ్‌భగవత్ మాట్లాడుతూ నగదు, మద్యం, వస్తువులు, డ్రగ్స్ ఇలా అన్ని కలిపి రూ.7,54 కోట్ల విలువ గల వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏకగ్రీవాలకు సంబంధించి సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వచ్చిన ఫిర్యాదులపై అక్కడి పోలీస్ కమిషనర్లు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలపై 3,214 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన పారితోషికం రేట్లను పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


