నిర్మల్ జిల్లా యాపలగూడలో పోలింగ్ విధుల నిర్వహణకు తెప్పపై కడెం వాగును దాటి వెళ్తున్న ఎన్నికల సిబ్బంది. చిత్రంలో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్ ఖానం–పెంబి
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
వెంటనే కౌంటింగ్ .. విజేతల ప్రకటన..ఉప సర్పంచ్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రారంభానికి గంట ముందే ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తి కాగానే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన వారిలో విజేతలను ప్రకటించనున్నారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మరుసటిరోజు ఆ ఎన్నికను చేపడతారు. మొదటి దశలో 3,834 సర్పంచ్ పదవులకు 12,960 అభ్యర్థులు, 27,628 వార్డుసభ్య స్థానాలకు 65,455 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఈ విడతకు సంబంధించి 5 గ్రామాలకు, 169 వార్డులకు అసలు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి. 396 పంచాయతీల్లో సర్పంచ్‌లు, 9,633 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఒక సర్పంచ్ స్థానంలో, 10 వార్డులలో కోర్టు స్టే కారణంగా ఎన్నికలు జరగడం లేదు. ఇక పోటీలో ఉన్న సర్పంచ్‌అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్ బ్యాలెట్ పేపర్ గులాబీ, వార్డు సభ్యుడి బ్యాలెట్‌పేపర్ తెలుపు రంగులో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగియగానే మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. 
సామాగ్రి, సిబ్బంది రెడీ..
పోలింగ్‌కేంద్రాలకు బుధవారం ఎన్నికల సామాగ్రి చేరుకుంది. సాయంత్రం కల్లా పోలింగ్‌సిబ్బంది కూడా చేరుకున్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బ్యాలెట్ బాక్సుల నుంచి బందోబస్తు వరకు అన్నీ పక్కాగా ఉండేలా జిల్లాల్లో అధికార యంత్రాంగం ’జీరో ఎర్రర్’ విధానాన్ని అనుసరిస్తోంది. ఓటరు స్లిప్పుల విషయంలో ఈసారి ఎస్‌ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది. పోలింగ్‌కు 3 రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి స్లిప్పులను పంపిణీ చేశారు.
బుధవారం సాయంత్రం కల్లా వంద శాతం పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది. ఇవి అందనివారి కోసం పోలింగ్ రోజు కేంద్రం బయట బీఎల్వోలు అందుబాటులో ఉంటారు. నేరుగా tsec. gov. in వెబ్‌సైట్ నుంచి కూడా ఫొటో లేని ఓటరు స్లిప్పును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు నుంచే మద్యం అమ్మకాలను నిషేధించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఆధార్, పాస్ట్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ తదితర గుర్తింపు కార్డులను ఉపయోగించవచ్చునని ఎస్‌ఈసీ ప్రకటించింది.


