కేకే కుమారుడు, కూతురికి భూ క్రమబద్ధీకరణపై హైకోర్టు ప్రశ్న
సామాన్యులకూ ఈ ధరలకే ఎల్‌ఆర్‌ఎస్ చేస్తున్నారా?
జీవోను పునఃపరిశీలించి.. తప్పు సరిదిద్దుకోండి
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లో గజం రూ.350 చొప్పున మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుటుంబ సభ్యులకు భూమిని క్రమబద్ధీకరించడం ఎంతవరకు సబబని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సామాన్య ప్రజలకూ అదే ధరకు ఎల్‌ఆర్‌ఎస్ చేస్తున్నారా అని అడిగింది. జీవోలో లోపాలు కనిపిస్తున్నా యని, పరిశీలించి తప్పు ఉంటే సరిదిద్దుకోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో తామే జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది.
కేకే కుమారుడు వెంకటేశ్వర్‌రావు, కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మికి భూమి క్రమబద్ధీకరణ చేస్తూ 2023, మే 23న విడుదల చేసిన జీవో 56ను సవాల్ చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ జీవో కింద వందల కోట్ల విలువైన భూమిని కె.కేశవరావు కుమారుడు, కూతురుతోపాటు కవితరావుకు నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ చేశారన్నారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, ఎన్‌బీటీ నగర్‌లో 1,161 గజాల భూమిని రూ.2,500 చొప్పున, 425 గజాలను రూ.350 చొప్పున క్రమబద్ధీకరించారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
మురికివాడల్లో క్రమబద్ధీకరణకూ ఓ పరిమితి
పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రేయస్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అత్యంత ఖరీదైన బంజారాహిల్స్‌లో స్వల్ప ధరలకు ప్రభుత్వం భూ క్రమబద్ధీకరణ చేసిందన్నారు. ప్రభుత్వ మార్కెట్ ధర రూ.60 వేలు ఉండగా, రూ.350, రూ.2,500కు గజం చొప్పున ఇచ్చిందన్నారు. దీంతో ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. లబ్ధిదారులు ఆర్థిక శాఖకు వినతిపత్రం సమర్పించడంతో ప్రత్యేక జీవో విడుదల చేశారన్నారు.
అప్పటికే ఒక ప్లాట్‌కు విద్యుత్ కనెక్షన్ ఉండటంతో.. కనెక్షన్ తీసుకున్న నాటి మార్కెట్ ధరకే క్రమబద్ధీకరించినట్లు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవో అందరికీ ఒకేలా ఉండాలి కానీ.. ఇలా ఒకరికి అనుకూలంగా ఉండేలా ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. మురికివాడల్లోనూ భూ క్రమబద్ధీకరణకు కూడా ఓ పరిమితి ఉందని వ్యాఖ్యానించింది. 1998 నాటి ధరను పరిగణనలోకి తీసుకోవడం సమర్థనీయం కాదంది.


