కమ్యూనికేషన్ కోసం మావోయిస్టుల కొత్తకోడ్ లాంగ్వేజ్
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో బయటపడిన ఈ వ్యవహారం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం : ఓ వైపు వరుస లొంగుబాట్లతో పార్టీ బలహీనపడుతున్నా.. మావోయిస్టుల్లోని ఒక వర్గం సాయుధ పోరాట పంథానే కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ బలగాల నుంచి తమ కార్యకలాపాలను రహస్యంగా ఉంచడంపై దృష్టి సారించింది. ఈ మేరకు కొత్తరకం కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది.
నిర్బంధంతో బృందాల మధ్య తెగిన సంబంధాలు
శాంతిచర్చల ప్రస్తావన మొదలైనప్పటి నుంచి మావోయిస్టుల నుంచి తరచూ వినిపిస్తున్న మాట కమ్యూనికేషన్ గ్యాప్. ‘మా మధ్య కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. కలిసి మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వండి. ఒకసారి మాలో మేం చర్చించుకొని సాయుధ పోరాట విరమణ, లొంగుబాట్లపై సామూహిక నిర్ణయం తీసుకుంటాం’అని మావోయిస్టులు కోరుతున్నారు. ఏప్రిల్‌లో రూపేశ్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు దగ్గర నుంచి నిన్నటి అనంత్ వరకు అందరూ ఇదే డిమాండ్ చేశారు.
కానీ ప్రభుత్వం ససేమిరా అనడంతో ఎవరికి వారే లొంగిపోతున్నారు. అయితే ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో సాయుధ పోరాట పంథా కొనసాగిస్తామంటున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు పోలీసుల కన్నుగప్పి అంతర్గత సమాచారం చేరవేసుకునేందుకు తమ కమ్యూనికేషన్ విభాగంలో కొత్తకోడ్ లాంగ్వేజ్ రూపొందించుకున్నారు. ఇటీవల బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లభ్యమైన డాక్యుమెంట్లలో ఈ విషయం బయటపడింది.
భద్రతా దళాల సమాచారం?
రహస్య జీవితం, అజ్ఞాత విధానంలో పనిచేసే సంస్థలు ప్రభుత్వ / శత్రు నిఘా వర్గాలకు చిక్కకుండా కోడ్ లాంగ్వేజ్‌లో సమాచారం చేరవేసుకుంటాయి. అందులో భాగంగా వాడుకలో ఉండే వివిధ ప్రాంతాలు, పండ్లు, కూరగాయలు, సముద్రాలు, నదులకు సైతం కోడ్ లాంగ్వేజ్‌లో పేర్లు ఉన్నాయి. వివిధ నంబర్లకు కూడా ఇలాగే నిత్య జీవితంలో కనిపించే వస్తువులు, ప్రదేశాల పేర్లు ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఉల్లిపాయలకు సంబంధించిన కోడ్ నేమ్ 201గా ఉంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో భాగంగా దండకారణ్యంలో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్ తదితర పేర్లతో భద్రతా దళాలు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. వీటికి బెటాలియన్ల వారీగా నంబర్లు కేటాయించి, అక్కడి నుంచి కంపెనీల వారీగా ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంపులను నెలకొల్పుతున్నాయి.
ఈ క్రమంలో బీజాపూర్, సుక్మా జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టే ఒక బెటాలియన్‌ను ఉల్లిగడ్డగా పేర్కొంటూ నక్సలైట్లు కొత్త కోడ్ లాంగ్వేజ్ రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా శత్రువుల (భద్రతా దళాల) కదలికలను అంచనా వేస్తూ తమ వ్యూహాలకు పదును పెట్టే పనిచేస్తున్నట్టు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో ఉన్న ప్రభుత్వ విభాగాలు అనుమానిస్తున్నాయి.
ఆ ధరకైతే వెనక్కే
ఈ నెల 3వ తేదీన బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయి స్టులు, ముగ్గురు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఘటనాస్థలి నుంచి మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని భద్రతా బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. ఇందులో విప్లవ సాహిత్యం, నిత్యావసర వస్తువులు, డైరీలు, నోట్ పుస్తకాలు ఉన్నాయి. అందులోని ఒక నోట్‌బుక్‌లో రాసి ఉన్న విషయాలు అసాధారణంగా కనిపించాయి.
గోండు భాషలో కేజీ ఉల్లిపాయలు రూ.25 నుంచి మొదలుపెట్టి రూ.30 వరకు రాసుకుంటూ పోయారు. వేర్వేరు ధరలకు వేర్వేరు అర్థాలు రాసుకొచ్చారు. కేజీ రూ.25 అయితే తీసుకురావొచ్చని, రూ.26 అయితే అక్కడే ఉంచాలని, రూ.27 అయితే వెనక్కి ఇవ్వాలని ఇలా ఒక్కో ధరకు ఒక్కో అర్థం రాసి ఉంది. దీనిపై అనుమానం వచి్చన భద్రతాదళాలు ఇదేమైనా కోడ్ లాంగ్వేజ్ కావొచ్చేమోనని ఆరా తీశారు.


