విద్యార్థుల చెంతకు ఆధునిక పోస్టల్ సేవలు
రాష్ట్రంలో జెన్ జెడ్ థీమ్‌లో తొలిసారిగా..
కాజీపేట అర్బన్: ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల కోసం కేంద్ర సమా చార శాఖ జెన్ జెడ్ పోస్టాఫీస్ సేవలు అందుబాటులోకి తెస్తోంది. విద్యార్థుల చెంతకు పోస్టల్ సేవల పేరిట రాష్ట్రంలో తొలిసారిగా నిట్ వరంగల్ క్యాంపస్‌లో బుధవారం జెన్ జెడ్ «థీమ్ పోస్టాఫీస్ సేవలు ప్రారంభమయ్యాయి.
నిట్ వరంగల్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, పోస్ట్‌మాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ సుమిత అయోధ్య జ్యోతి ప్రజ్వలన చేసి సేవలను ప్రారంభించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోస్టాఫీస్‌లో సేవలు అందుబాటులో ఉంటాయి. పోస్టల్ సేవలతోపాటు బ్యాంకింగ్, బీమా, ఆధార్ తదితర సేవలన్నింటినీ ఆధునిక టెక్నాలజీతో, క్యూఆర్ కోడ్ చెల్లింపులతోఅందిస్తారు.
జెన్ జెడ్ పోస్టాఫీస్..: 1997 నుంచి 2012వ సంవత్సరం వరకు జన్మించిన వారి అభిరుచికి అనుగుణంగా, నేటి తరానికి ఆకర్షణగా జెన్ జెడ్ పేరిట పోస్టల్ సేవలను తీసుకొచ్చారు. పోస్టాఫీస్‌లో విద్యార్థులకు ఆన్‌లైన్ సేవల కోసం ఫ్రీ వైఫై అందిస్తున్నారు. అలాగే, ఇక్కడ వివిధ రకాల మ్యాగజైన్స్ అందుబాటులో ఉంచారు.
పోస్టల్ సేవలపై అవగాహనకు రౌండ్ టేబుల్ సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఆయా గదులను వివిధ రకాల పోస్టల్ స్టాంప్ నమూనాలతో అందంగా అలంకరించారు. స్పీడ్ పోస్ట్‌పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నారు.


