హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లతో కలిసి నిర్వహిస్తాం: కేటీఆర్
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మోసం చేసింది
నెలకు రూ.1,000 ఇస్తామనిచెప్పింది..రెండేళ్ల బాకీ రూ.1,560 కోట్లు తక్షణమే చెల్లించాలి
కరీంనగర్ జిల్లాలోని ఆటో కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కార్డుల పంపిణీ
సిరిసిల్ల: ఆటో కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో వారితో కలిసి మహాధర్నా చేస్తామని చెప్పారు.
ఆటోడ్రైవర్లకు నెలకు రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.1,560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 5వేల మంది ఆటోడ్రైవర్లకు ఆత్మీయ భరోసా పేరిట రూ.5 లక్షల సొంత డబ్బులతో చేయించిన ప్రమాద బీమాకు సంబంధించిన కార్డులను బుధవారం ఆయన పంపిణీ చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.
అసంఘటిత రంగ కార్మికులకు కేసీఆర్ అండ
‘ఆటో అన్నలతో బీఆర్‌ఎస్‌కు ఉన్న అనుబంధం కొత్తది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో, పార్టీ అధినేత కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేసినప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో, ఆటో డ్రైవర్లు కూడా ముందుండి పోరాడారు. ‘తెలంగాణ కావాలే’అని ర్యాలీలు తీసి కేసీఆర్‌కు మద్దతుగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికులపై కేసీఆర్ తన ప్రేమను చాటుకున్నారు.
రాష్ట్రంలోని సుమారు 6.5 లక్షల నుంచి 7 లక్షల మంది ఆటో కార్మికులు అడగకుండానే, పార్టీ మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగమాటలు చెప్పకుండానే రూ.5 లక్షల ప్రమాద బీమాను కల్పించారు. రైతుబీమాను తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చింది కేసీఆర్ ఒక్కరే. డ్రైవర్లకు, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన కార్మిక పక్షపాతి కేసీఆర్.
ఆటో డ్రైవర్లతోపాటు అసంఘటిత రంగంలోని దాదాపు 13.50 లక్షల మంది డ్రైవర్లకు (వ్యాన్లు, జీపులు, ట్రాక్టర్లు, ట్యాక్సీలు, లారీలు) రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు బీమా ఊడగొట్టింది. మా ప్రభుత్వంలో మంచిగా దర్జాగా బతికిన ఆటో డ్రైవర్ మష్రత్ అలీ, రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలతో నేడు రెండు ఆటోలు అమ్ముకుని, కిరాయి ఆటో నడుపుకునే పరిస్థితి వచ్చింది..’అని కేటీఆర్ చెప్పారు.
అవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలు
‘రాష్ట్రంలో మార్పు, మార్పు అంటూ జరిగిన మోసం ఎలా ఉంటుందో రెండేళ్లలో ప్రజలకు అర్థమైంది. రైతులు, యువత, మహిళలు సహా అందరికీ 420 హామీలు ఇచ్చి మోసం చేశారు. రైతు రుణమాఫీ చేయాలంటే రూ.50 వేల కోట్లు అవసరం ఉండగా.. రూ.12 వేల కోట్లు ఇచ్చి అయిపోయిందని ప్రచారం చేసుకున్నారు. దేవుళ్లపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్కో ఆటో డ్రైవర్‌కు ప్రభుత్వం రూ.24 వేలు బాకీ పడింది. మరోవైపు ఈ రెండేళ్లలో 162 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. కాంగ్రెసోడు ఊరికే ఇవ్వడు. గల్లా పట్టి అడిగితేనే ఇస్తాడు.. అందుకే పోరాటం తప్పదు..’అని కేటీఆర్ అన్నారు. జిల్లాలోని అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతిలోపు తాము ప్రమాద బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్లు ఒక క్రెడిట్ సొసైటీ (కోఆపరేటివ్)గా ఏర్పడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కొండూరి రవీందర్‌రావు, తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్లు తులా ఉమ, అరుణ, ఆటోకార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


