సాక్షి, నల్గొండ: తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య దాడి జరిగింది. దీంతో, టెన్షన్ వాతావరణం నెలకొంది.
వివరాల ప్రకారం.. నల్లగొండలోని కేతేపల్లి మండలంలో బుధవారం అర్ధరాత్రి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొర్లపహాడ్‌లో రాళ్లు, కత్తులతో ఇరు వర్గాల కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురికి గాయపడటంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో, కొర్లపహాడ్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 3,834 పంచాయతీలు, 27,628 వార్డులకు పోలింగ్, ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నేడే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.


