ఉపకార వేతనాలకు 3711 దరఖాస్తులు
నల్లగొండ : ఉపకార వేతనాలు పొందేందుకు ఇప్పటి వరకు 3711 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 13,194 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 28 శాతం మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. పీఏపల్లి మండలంలో 90 శాతం మంది స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తిరుమలగిరి సాగర్, ఇతర మండలాలు దరఖాస్తుల స్వీకరణలో ముందున్నాయని పేర్కొన్నారు. విద్యాశాఖ, బ్యాంకు, రెవెన్యూ, సంక్షేమ అధికారులతో సమన్వయం చేసుకుని విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేలా చూడాలని సూచించారు.
కరాటే శిక్షకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ టూటౌన్ : జిల్లాలోని 14 పాఠశాలల్లో బాలికలకు కరాటే నేర్చించడానికి ఆసక్తి, కరాటే బ్లాక్ బెల్ట్ కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి మహ్మద్ అక్బర్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరాటే బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లు, పూర్తి బయోడేటాతో ఈనెల 15వ తేదీలోగా నల్లగొండలోని యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికై న వారికి నెలకు రూ.5 వేల చొప్పున పారితోషికం ఇస్తామని, మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు గాంధీనగర్ పార్కు స్కూల్ మిర్యాలగూడ, కొండ భీమనపల్లి, ఈదులగూడ మిర్యాలగూడ, తక్కెళ్లపహాడ్, అన్నెపర్తి, రంగుండ్లతండా, దామెర, తాళ్లవీరప్పగూడెం, 12వ బెటాలియన్ అన్నెపర్తి, వెంకటాద్రిపాలెం, చీకటిమామిడి, దర్వేశిపురం, సర్వారం, పొనుగోడు పాఠశాలల్లో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.
హక్కులు అందరికీ సమానం
నల్లగొండ : మానవ హక్కులు ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తాయని జిల్లా జైల్ సూపరింటెండెంట్ గౌరు ప్రమోద్‌కుమార్ అన్నారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని బుధవారం నల్లగొండలోని జిల్లా జైల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలు కూడా సమాజంలో ఒక భాగమే అన్నారు. వారికి న్యాయ సహాయం, గౌరవం, రక్షణ, పునరావాస అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు భీమార్జున్‌రెడ్డి, లెనిన్‌బాబు ఖైదీలకు ఉచిత న్యాయం, న్యాయ సలహాలు, లీగల్ ఎయిడ్ క్లినిక్స్ కార్యకలాపాలు, న్యాయ పరిరక్షణకు సంబంధించిన అంశాలను వివరించారు. కార్యక్రమంలో జైలర్ బాలకృష్ణ, డిప్యూటీ జైలర్ ఎంపల్లి వెంకట్‌రెడ్డి, చింత వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సీఎంను విమర్శిస్తే ఊరుకోం
నల్లగొండ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని.. నాలుక చీరేస్తామని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి సీఎం రేవంత్‌రెడ్డిపై, కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. నల్లగొండ అభివృద్ధిలో కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్ర ఎంతో ఉందన్నారు. నువ్వే నయీమ్‌తో అంటకాగి రూ.వందల కోట్లు సంపాదించావని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకుని మీ దండుపాల్యం ముఠాకు చెప్పులు మోసిన నువ్వు ఎమ్మెల్యే అయ్యాక.. విద్యార్థి, ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పుల తెలంగాణను.. అభివృద్ధి పథంలోరి తీసుకెళుతున్నాడన్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని. అది కళ్లకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఈకారు రేస్ కేసులో కేటీఆర్ జైలుకు పోక తప్పదన్నారు. ఇప్పటికై నా నోరు అదుపులో పెట్టుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి గురి కాకతప్పదని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ బోడ స్వామి, తాడూరి శ్రీను, శరత్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.
ఉపకార వేతనాలకు 3711 దరఖాస్తులు


