పోలింగ్ సిబ్బంది జాగ్రత్త వహించాలి
రామగిరి(నల్లగొండ) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్లగొండలోని డీఆర్సీ కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేసి.. సిబ్బంది పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి టీపోల్‌లో పోలింగ్ శాతాన్ని నమోదు చేస్తామన్నారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి వివాదాలకు తావివ్వొద్దని, పోలింగ్ కేంద్రం నుంచి ఎలాంటి పేపర్లయినా బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. ప్రతిపాదించిన ఏజెంట్లను ఎట్టి పరిస్థితులను మార్చవద్దన్నారు. టెండర్, ఛాలెంజ్ ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఆమోదించిన 14 కార్డుల్లో ఏదో ఒకటి గుర్తింపుగా చూపించి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అనుమతించాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ అధికారి రమేష్, తహసీల్దార్ పరుశురాం, ఎంపీడీఓ యాకూబ్ తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


