రాయికోడ్(అందోల్): కొడుకు సర్పంచ్ బరిలో దిగితే ఆ మాతృమూర్తి మురిసిపోయింది. ఊరికి రా‘రాజు’అవుతాడని కలలు కన్నది. అయితే.. ఎన్నికల్లో అన్నీ ప్రతికూల పరిస్థితులు ఎదురవడం.. నమ్మిన వారే నట్టేట ముంచడం.. చేతిలో ఉన్న డబ్బు చూస్తుండగానే కర్పూరంలా కరిగిపోవడం.. ఆఖరుకు తల్లి ధైర్యం చెప్పినా కోలుకోలేని నిస్సహాయస్థితి దాపురించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.
రాయికల్ మండలంలోని పీపడ్‌పల్లికి చెందిన రాజు (35) చురుకైన కాంగ్రెస్ కార్యకర్త. ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచాడు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న క్రమంలో ఎన్నికల ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. నమ్ముకున్న పార్టీ నాయకులు ఒక్కొక్కరు పక్కకు జారుకుంటున్నారు. బరిలో దింపిన సీనియర్లే తనకు సహకరించడం లేదని సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. తోటి నాయకుల సహకారం లభించడం లేదు.
బిడ్డా.. పొలం అమ్ముకో..
ఇక తాను ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేనని తల్లికి చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు పడుతున్న బాధలు భరించలేని ఆ తల్లి.. ‘ఎకరం పొలం అమ్ముకో బిడ్డా.. ధైర్యంగా ఉండు’అని చెప్పింది. అన్ని వైపుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడంతో రాజు ధైర్యం కోల్పోయాడు. అయ్యప్ప మాల ధరించిన అతను .. ఉపవాస దీక్షతో పాటు ప్రచారం చేస్తుండటంతో సరైన నిద్ర లేదు. దీంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో స్నేహితులు రాయికోడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
అనంతరం ఎప్పటిలాగానే శంషొద్దీన్‌పూర్ గ్రామ శివారులోని అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నాడు. అక్కడే తోటి స్వాములతో కలసి నిద్రించాడు. వేకువజామున ఐదు గంటలకు కాలకృత్యాలకని వెళ్లి సన్నిధానానికి కొంతదూరంలోని చెట్టుకు మెడలోని మాల టవల్‌తో ఉరివేసుకున్నాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి స్వాములు వెతకగా అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలం వద్ద ,మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చైతన్యకిరణ్ తెలిపారు.
గ్రామంలో విషాద ఛాయలు
మృధుస్వభావి అయిన రాజు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లికి ఒక్కడే కుమారుడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతుడి తల్లి, భార్య బంధువుల రోదనలు మిన్నంటాయి.


