శ్రీకాకుళం జిల్లా: ఓ సర్పంచ్ ఏకంగా సర్కారుకే ఆఫరిచ్చారు. ఎంత వేచి చూసినా గ్రామానికి రోడ్డు పడకపోవడం, ఉన్న దారులను బాగు చేయకపోవడంతో రోడ్డు వేస్తే తాను ఏం చేస్తానో చెబుతూ ప్రభుత్వానికి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కొత్తూరు మండలంలోని గురండి సర్పంచ్ బోర సింహాద్రి నాయుడు ఈ ప్రకటన చేశారు. గురండి గ్రామానికి వచ్చే నాలుగు రహదారులు పూర్తిగా పాడయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు, నాయకులు స్పందించలేదు. దీంతో స్థానిక సర్పంచ్ ఓ ప్రకటన చేశారు. గురండి గ్రామానికి వచ్చే నాలుగు రహదారులను ప్రభుత్వం మంజూరు చేసి పనులు ప్రారంభిస్తే.. ఆ కాంట్రాక్టర్‌కు రూ.3 లక్షలు సాయం చేయడంతో పాటు రోడ్డు పనులు పూర్తయ్యే వరకు వాటర్ ట్యాంకుతో నీరు సరఫరా చేస్తానని ప్రకటించారు. ఏప్రిల్ రెండోతో సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తవుతున్నందున ఏప్రిల్ రెండో తేదీ లోపు పనులు ప్రారంభిస్తేనే ఈ సాయం అందజేస్తానని తెలిపారు. దీనిపై సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లోనూ విన్నవించారు.


