తనిఖీలు తప్పనిసరి..
ఉచితంగా గ్లకోమా పరీక్షలు..
శ్రీకాకుళం/శ్రీకాకుళం కల్చరల్ :
ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేవరకు వరకు మంచి దృష్టితో జీవించాలనేది కోరిక. అయితే చాలామంది నేత్రాలను అశ్రద్ధ చేయడం, కంటి ఆరోగ్యం అవగాహన లేకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారు. కంటి శుక్లాలు, దృష్టిలోపాలు, డయాబెటిక్ రెటినోపతి, గ్లూకోమా వ్యాధులు అంధత్వానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నేత్రాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా అంధత్వ నివారణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 14 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
గ్లకోమా..
గ్లకోమా కంటి వ్యాధిని నీటికాసులుగా కూడా పేర్కొంటారు. దీనిబారిన పడితే కంటిచూపు తిరిగి పొందలేం. కంటి నాడిపై ఒత్తిడి పెరగటం వల్ల చూపు క్రమంగా క్షీణిస్తుంది. గ్లకోమాలో సాధారణంగా ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా శాశ్వత అంధత్వానికి దారితీస్తుంది. ఈ ఏడాది ‘గ్లకోమా రహిత ప్రపంచం కోసం ఐక్యమవుదాం’ అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఎవరికి రావచ్చంటే..
హై మయోపియా దృష్టిలోపం, 40 ఏళ్లు పైబడిన వారు, ముందుతరంలో గ్లకోమా ఉన్నవారు, షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు, కంటి గాయాలైన వారు, నిరంతరం స్టెరాయిడ్ మందులు వాడిన వారు గ్లకోమా బారిన పడవచ్చు.
నివారణ చర్యలు..
కుటుంబంలో గతంలో ఎవరైనా గ్లకోమా వ్యాధిగ్రస్తులుంటే మిగిలిన వారు 30 ఏళ్లు దాటాక సంపూర్ణ కంటిపరీక్షలు చేయించుకోవాలి. కంటి గాయాలబారిన పడితే నిర్లక్ష్యం చేయకుండా నేత్ర నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందాలి. క్రమం తప్పకుండా మందులు వాడాలి.
కంటి పరీక్ష నిర్వహిస్తున్న వైద్యులు
షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, 40 ఏళ్లు పైబడిన వారు, గ్లకోమా వ్యాధి చరిత్ర కుటుంబాల వారు ప్రతి ఏడాది తప్పనిసరిగా నేత్రవైద్య నిపుణులను సంప్రదించాలి. దీనివల్ల శాశ్వత అంధత్వానికి గురికాకుండా ఉంటారు. తల్లిదండ్రులు చిన్నారులను పాఠశాలలో చేర్చే ముందు నేత్ర వైద్యునితో తప్పనిసరిగా దృష్టి పరీక్ష చేయించాలి.
– ఎంఆర్‌కే దాస్,
ఆప్తాల్మిక్ అధికారి
గ్లకోమా కంటి పరీక్షలు అవసరం ఉన్నవారికి, సాధారణ కంటి పరీక్షలకు వచ్చిన వారందరికీ గ్లకోమా నిర్ధారణ కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మండల స్థాయిలో పారామెడికల్ ఆప్తాలమిక్ అధికారులతో గ్లకోమా వ్యాధిపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ ఎస్.పుష్పలత,
జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్, ఆంధత్వ నివారణ సంస్థ శ్రీకాకుళం


