రాజకీయ కుట్రలు వద్దు..
పాలకపగ్గాలే లక్ష్యంగా..
● పూడివలసలో గ్రామదేవత ఆలయాల నిర్వహణకు కొత్తగా సొసైటీ ● రాజకీయ జోక్యం సరికాదంటున్న నాయుడువారి కుటుంబం
రణస్థలం: ఎచ్చెర్ల మండలం పూడివలసలో అసిరితల్లి అమ్మవారి ఆలయాల నిర్వహణలో రాజకీయ జోక్యం జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో గ్రామదేవత ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి నాయుడువారి కుటుంబం ఆధ్వర్యంలోనే ఆలయ నిర్వహణ, నిత్య పూజలు,ఉత్సవాల నిర్వహణ ధర్మబద్ధంగా నీతిగా నిజాయితీగా జరుగుతూ వస్తున్నాయి. గ్రామస్తులు, ఇతర గ్రామాల భక్తుల సహకారంతో నిరాటంకంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది సొసైటీ పేరుతో ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నాయుడువారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొసైటీ ముసుగులో కక్షసాధింపు..
పూడివలస పరిసర గ్రామాల్లో నాయుడువారి కుటుంబానికి గ్రామదేవత ఆశీస్సులతో మంచి ఆదరణ ఉంది. ఈ ఆదరణతో రాజకీయంగా ఎక్కడ ఎదుగుతారోనని భయంతో కూటమి నేతలు కుట్రలకు తెరలేపారని నాయుడోరి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా తరతరలాల సంప్రదాయాన్ని పక్కన పెట్టేలా కార్యచరణ రచించారని, దీనిలో భాగంగా గ్రామదేవత పాలక పగ్గాలపై అందరికి హక్కులు ఉన్నాయంటూ గ్రామస్తులను రెచ్చగొట్టారని, గత సెప్టెంబర్‌లో గ్రామదేవత పూజాది కార్యక్రమాలు, ఆదాయం, ఇతరత్రా ఏర్పాటు సొసైటీ చూసుకుంటుందంటూ కూటమి నాయకులు సొసైటీని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. వెనువెంటనే ఆలయం వద్ద సమావేశమై నాయుడువారి కుటుంబానికి ఇకపై ఎటువంటి పాలన పరమైన హక్కులు ఉండవని, రోజూ వచ్చి పూజ చేసుకుని వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారని వాపోతున్నారు. ఆలయ రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.
మా నాయుడువారి కుటుంబం ద్వారా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలయాల నిర్వహణ జరుగుతుంది. ఈ విషయం గ్రామస్తులు, పెద్దలు, సమీప గ్రామాల ప్రజలకూ తెలుసు. అవసరమైతే గ్రామపెద్దల సమక్షంలో ధ్రువీకరణ పత్రాలు, చారిత్రక ఆధారాలు, ఇతర పత్రాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. తరతరాలుగా నిర్వహిస్తున్న కుటుంబాలను పక్కన పెట్టి సంప్రదాయాలకు భంగం కలిగించడం తగదు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చేందుకు సిద్ధం. 1987 చారిటబుల్ హిందూ రెలీజియస్ ఇన్‌స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం సంప్రదాయ వారసత్వ హక్కులు లభిస్తాయి. సెక్షన్ 17 ప్రకారం సనాతన సంప్రదాయకంగా నిర్వహించిన కుటుంబాలకు హక్కులుంటాయి. గ్రామదేవతను రాజకీయ కుట్రలకు వేదికగా వాడుకోవాలని చూస్తే చరిత్ర క్షమించదు.
– గొలివి శ్రీనివాసరావు, పూడివలస


