breaking news
Roju
-
ఎకరం పొలం అమ్ముకో బిడ్డా.. ధైర్యంగా ఉండు
రాయికోడ్(అందోల్): కొడుకు సర్పంచ్ బరిలో దిగితే ఆ మాతృమూర్తి మురిసిపోయింది. ఊరికి రా‘రాజు’అవుతాడని కలలు కన్నది. అయితే.. ఎన్నికల్లో అన్నీ ప్రతికూల పరిస్థితులు ఎదురవడం.. నమ్మిన వారే నట్టేట ముంచడం.. చేతిలో ఉన్న డబ్బు చూస్తుండగానే కర్పూరంలా కరిగిపోవడం.. ఆఖరుకు తల్లి ధైర్యం చెప్పినా కోలుకోలేని నిస్సహాయస్థితి దాపురించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. రాయికల్ మండలంలోని పీపడ్పల్లికి చెందిన రాజు (35) చురుకైన కాంగ్రెస్ కార్యకర్త. ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచాడు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న క్రమంలో ఎన్నికల ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. నమ్ముకున్న పార్టీ నాయకులు ఒక్కొక్కరు పక్కకు జారుకుంటున్నారు. బరిలో దింపిన సీనియర్లే తనకు సహకరించడం లేదని సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. తోటి నాయకుల సహకారం లభించడం లేదు.బిడ్డా.. పొలం అమ్ముకో.. ఇక తాను ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేనని తల్లికి చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు పడుతున్న బాధలు భరించలేని ఆ తల్లి.. ‘ఎకరం పొలం అమ్ముకో బిడ్డా.. ధైర్యంగా ఉండు’అని చెప్పింది. అన్ని వైపుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడంతో రాజు ధైర్యం కోల్పోయాడు. అయ్యప్ప మాల ధరించిన అతను .. ఉపవాస దీక్షతో పాటు ప్రచారం చేస్తుండటంతో సరైన నిద్ర లేదు. దీంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో స్నేహితులు రాయికోడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అనంతరం ఎప్పటిలాగానే శంషొద్దీన్పూర్ గ్రామ శివారులోని అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నాడు. అక్కడే తోటి స్వాములతో కలసి నిద్రించాడు. వేకువజామున ఐదు గంటలకు కాలకృత్యాలకని వెళ్లి సన్నిధానానికి కొంతదూరంలోని చెట్టుకు మెడలోని మాల టవల్‌తో ఉరివేసుకున్నాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి స్వాములు వెతకగా అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలం వద్ద ,మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకిరణ్ తెలిపారు.గ్రామంలో విషాద ఛాయలు మృధుస్వభావి అయిన రాజు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లికి ఒక్కడే కుమారుడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతుడి తల్లి, భార్య బంధువుల రోదనలు మిన్నంటాయి. -
కార్మికులసమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్:ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే యాజమాన్యం పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ కార్యదర్శి ఎం.ఎ. రాజు, జోనల్ ఆఫీస్ బేరర్ బి.టి.రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ రెండు రోజుల రిలేనిరాహారదీక్ష కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో దీక్షా శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడుతూ మే 2015 నెలలో జరిగిన 8 రోజుల సమ్మె కాలపు జీతాన్ని ఏరియర్స్‌తో కలిపి చెల్లించాలని, జూలై–2016 నుంచి రావాల్సిన డీఏను ఏరియర్స్‌తో సహా వెంటనే చెల్లించాలని, అంగీకరించిన ప్రకారం సమైక్యాంధ్ర సమ్మె కాలానికి 60రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని, గ్యారేజీల్లో అన్ని కేటగిరిలలో ఖాళీలను భర్తీ చేయాలని, రద్దు చేసిన సర్వీసులను పునరుద్ధరించాలని, అన్ని సర్వీసులకు అవసరం మేరకు రన్నింగ్టైం ఇవ్వాలని, కొత్తబస్సులు ప్రవేశపెట్టాలని, డిస్ ఎంగేజ్ అయిన కండక్టర్, డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, అంగీకరించిన మేరకు పెండింగ్‌లో ఉన్న యూనిఫాం ఇవ్వాలని, 2015 లీవ్ఎన్క్యాష్మెంట్ వెంటనే చెల్లించాలని, 2013 నుంచి జోనల్ వర్క్‌షాపు టైర్షాపుల్లో రివైజ్డ్ మ్యాన్ పవర్ రేటును అమలు చేసి బకాయిలు చెల్లించాలని, నష్టాల పేరుతో సర్వీసులు రద్దు చేసే ప్రక్రియను నిలుపుదల చేయాలని తదితర డిమాండ్లపై ఈ రెండు రోజులు రిలే నిరాహారదీక్ష చేçపడుతున్నామని తెలిపారు. ఈ «నిరాహారదీక్షా శిబిరంలో సోమవారం దీక్షకు దిగిన వారిలో ఎన్ఎంయూ నేతలు ఎం.జి.కృష్ణా, ఎం.ఆర్.మూర్తి, పి.రమణ, ఆర్వీఎస్ఎస్ రావు, కె.పి.రావు, జె.ఆర్.కుమార్, టి.ఎస్.నారాయణ, ఎం.ఎస్.రాములు, బి.పి.రాజు, జె.ఎం.రావు, ఎం.ఎన్.రావు, ఆర్.వి.రావు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.


