సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాస్త ఒత్తిడితో కనిపిస్తున్నారు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ చోరీ విషయంలో తాను సవాల్ విసిరినా అమిత్ షా ఎందుకు స్పందించలేదని రాహుల్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా మాట్లాడుతూ..‘ఓటు చోరీ అంశంపై నేను ఇప్పటికే మూడు ప్రెస్ కాన్ఫరెన్స్లపై పార్లమెంట్లో చర్చించాలని అమిత్ షాకు సవాల్ విసిరాను. అయినా అమిత్ షా నుంచి దానిపై ఎటువంటి సమాధానం రాలేదు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. నిన్న అమిత్ షా చాలా ఆందోళనగా ఉన్నారు. ఆయన తప్పుడు భాష ఉపయోగించారు. ఆయన చేతులు వణికాయి. అమిత్ షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇది నిన్న అందరూ చూశారు.
నేను ఆయన్ని అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఎలాంటి రుజువు ఇవ్వలేదు. పార్లమెంట్లో నా మీడియా సమావేశాల్లోని అన్ని అంశాల గురించి చర్చించడానికి నేరుగా క్షేత్రస్థాయికి రావాలని నేను అమిత్ షాకు సవాలు విసిరాను. నాకు ఎలాంటి సమాధానం రాలేదు. అందరికీ వాస్తవమేంటో తెలుసు అని ఆరోపించారు. దీంతో, రాహుల్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.


