లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, అమిత్ షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఓట్ల చోరీపై తనతో చర్చకు సిద్ధమా? అని రాహుల్ సవాలు విసిరారు. ఎన్నికల సంఘం అండతోనే బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మంపడ్డారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
హరియాణాలో ఓట్ల చోరీ జరగలేదంటూ అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అక్కడ ఓట్ల చోరీకి ఆధారాలున్నాయని చెప్పారు. అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్లు తాను నడుచుకోవాలా? అని నిలదీశారు. విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. అమిత్ షా భయపడుతున్నారని, ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు.
నా ప్రశ్నకు సమాధానమేది?
ఓట్ల చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభలో తాము అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఓట్ల చోరీ, ఈవీంఎల పనితీరు గురించి తాము ప్రశి్నస్తే అమిత్ షా ఒక్కమాట కూడా మట్లాడలేదని అన్నారు. ఓట్ల చోరీపై ఇప్పటికే ఆధారాలు చూపించానని గుర్తుచేశారు. కానీ, అమిత్ షా దానిపై స్పందించలేదని రాహుల్ ఆక్షేపించారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు వేస్తున్నారని, దీనిపై అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని నిలదీశారు.
‘సర్’ను గబ్బర్‌సింగ్‌లా మార్చారు
‘‘గౌరవప్రదమైన ‘సర్’ పదాన్ని గబ్బర్‌సింగ్‌లా భయంకరమైన అంశంగా మార్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరిట ప్రజలను వేధిస్తున్నారు. సర్ సర్ అంటూ బీజేపీ ఎంతగా గొంతు చించుకున్నా బెంగాల్ ప్రజలు మాత్రం మేడమ్‌కు(మమతా బెనర్జీ) అండగా నిలుస్తారు. బీజేపీ నేతలు బెంగాల్‌లో కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపిస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి తిరిగివెళ్లారు. బీజేపీ బిహార్‌లో గెలిచిందేమో గానీ బిహార్‌లో వారి ఆటలు సాగవు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎందుకు చేపట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’
– శతాబ్ది రాయ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
బ్యాలెట్ పేపర్ల విధానం కావాలి
‘‘ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలి. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తోంది. చాలా ఏళ్లుగా బీజేపీకి సహకరిస్తోంది. ఎన్నికల సంఘానికి కలి్పంచిన కొన్ని చట్టపరమైన వెసులుబాట్లను తొలగించాలి. ప్రధాని ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల ఎంపికకు సంబంధించిన ప్యానెల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలి’’
– డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ
ఎస్‌ఐఆర్ అంటే బ్యాక్‌డోర్ ఎన్‌ఆర్‌సీ
‘‘పౌరుల జాతీయ రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ)కి మరో రూపమే ఎస్‌ఐఆర్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసుగులో దొడ్డిదారిన ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తున్నారు. మతం ఆధారంగా ఓటు హక్కును తొలగించడానికి ద్రోహపూరితమైన ప్రక్రియ జరుగుతోంది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి. ఎస్‌ఐఆర్ చేపట్టడం పార్లమెంటరీ వ్యవస్థను ఉల్లంఘించడమే అవుతుంది. పౌరులకు పార్లమెంట్ ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు కూడా ఈ ప్రక్రియ విరుద్ధమే’’
– అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ
ప్రజల హృదయాలను మోదీ హ్యాక్ చేశారు
ఎన్నికల్లో నెగ్గడానికి ఈవీఎంలను హ్యాక్ చేయాల్సిన అసవరం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేశారు. వారి మనసులు గెల్చుకున్నారు. ప్రజల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగకుండా ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టిస్తున్నారు’’
– కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ
మళ్లీ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ కావాలా?
‘‘ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానం మళ్లీ ప్రవేశపెడితే అప్పటి అరాచకాలు పునరావృతం అవుతాయి. బూత్ ఆక్రమణ, రిగ్గింగ్ మళ్లీ జరుగుతుంది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ల వాడకాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు సమరి్థంచాయి. ఈవీఎంలకు అనుకూలంగా ఎన్నో తీర్పులిచ్చాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తే ఎవరూ ముందుకు రాలేదు. ఈవీఎంలను అనుమానాలను ఇకనైనా మానుకోవాలి. ఈవీఎంలతో ఎన్నికలు వేగంగా, సురక్షితంగా జరుగుతాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కానీ, ఎన్నికలు ముసిగిన తర్వాత ఓట్ల చోరీ అంశంపై ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. నిజంగా ఓట్ల చోరీ జరిగిందని రుజువులుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎన్నికలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరగడానికి ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. ఎన్నికల వరుస పరాజయాలను జీరి్ణంచుకోలేక ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ మరో 15–20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడం తథ్యం’’
– రవి శంకర్ ప్రసాద్, బీజేపీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి


