కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం
ఇండిగో కార్యకలాపాలపై డీజీజీఏ ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: ఇండిగో విమానాల సంక్షోభం కొనసాగుతూనే ఉంది. బుధవారం 220 విమానాలు రద్దయ్యాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటిదాకా 4,000కుపైగా విమానాలు రాకపోకలు సాగించలేదు. ఎక్కడికక్కడ ఎయిర్‌పోర్టుల్లోనే ఆగిపోయాయి. ఇండిగో నిర్వాకం వల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే, పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోందని, రద్దవుతున్న విమానాల సంఖ్య తగ్గిపోతోందని ఇండిగో వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఇండిగో కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇండిగో ప్రధాన కార్యాలయంలో తమ సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇద్దరు ప్రభుత్వ అధికారులతో సహా ఎనిమిది మంది సీనియర్ కెపె్టన్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇండిగో గుర్గావ్ కార్యాలయంలో మకాం వేసి విమానాల రాకపోకలు, రద్దు, సిబ్బంది కొరత వంటి అంశాలను స్వయంగా పర్యవేక్షించనుంది. అలాగే డీజీసీకే నిత్యం నివేదిక సమరి్పస్తుంది.
సీఈఓకు డీజీసీఏ సమన్లు
ఇండిగో సీఈఓ పీటర్ ఎల్‌బెర్స్ డీజీసీఏ సమన్లు జారీ చేసింది. గురువారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సంక్షోభంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు 11 ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ఆపరేషన్లను స్వయంగా తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇందుకోసం నియమించిన ప్రత్యేక సిబ్బంది రాబోయే రెండు మూడు రోజుల్లో ఆయా ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేస్తారని వెల్లడించింది. సవరించిన విమానాల షెడ్యూల్‌ను ఇండిగో ఇప్పటికే డీజీసీఏకు సమరి్పంచింది.
పరిహారం ఇవ్వాలి: ఢిల్లీ హైకోర్టు
ఇండిగో విమానాల సంక్షోభంపై వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరిస్థితి చెయ్యిదాటిపోయే దాకా ఎందుకు వేచి చూశారని ఆక్షేపించింది. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. విమానాల రద్దు వల్ల నష్టపోయిన ప్రయాణికులకు తగిన పరిహారం ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఇందుకోసం చర్య లు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఇండిగో యా జమాన్యాన్ని ఆదేశించింది. విచారణ కమిటీ నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేయాలని స్పష్టంచేసింది.
క్షమాపణ కోరిన ఇండిగో చైర్మన్
ఇండిగో విమానాల రద్దు, ఆలస్యంగా రాకపోకలు, ప్రయాణికుల ఇబ్బందులపై తమ ఎయిర్‌లైన్స్ బోర్డు పూర్తిస్థాయిలో అధ్యయనం చేయబోతున్నట్లు ఇండిగో చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా బుధవారం తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. సంక్షోభానికి మూల కారణం ఏమిటో తెలుసుకుంటామని, ఇందుకోసం టెక్నికల్ నిపుణుల సహాయం తీసుకుంటామని చెప్పారు. ప్రయాణికులను క్షమాపణ కోరుతున్నానని వ్యాఖ్యానించారు. వారి అంచనాలకు తగ్గట్టుగా తాము పని చేయలేకపోయామని అంగీకరించారు. వారం రోజుల్లో తమపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయని, అందులో కొన్ని సరైనవి, మరికొన్ని సరైనవి కానివి ఉన్నాయని విక్రమ్ సింగ్ మెహతా పేర్కొన్నారు. విమానాల రద్దు అనేది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు.


